మంత్రి కేటీఆర్ vs శ్రీధర్‌బాబు.. ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం

by Disha Web Desk 19 |
మంత్రి కేటీఆర్ vs శ్రీధర్‌బాబు.. ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌పై చర్చలో భాగంగా ఫార్మా సిటీ భూముల సేకరణ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్ లాండ్స్‌ను అప్పగిస్తే వాటిని ఇప్పటి ప్రభుత్వం తక్కువ ధరకు కొని ఫార్మా కంపెనీలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నదని ఆరోపించారు. ఒక్కో ఎకరాన్ని రైతుల నుంచి రూ. 18 లక్షలకు కొని కంపెనీలకు రూ. 1.38 కోట్లకు అమ్ముతున్నట్లు శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ వాటిని ఆధారాలతో నిరూపించగలరా అని సవాలు చేశారు. అవాస్తవాలు, ఆధారాలు లేని మాటలను సభలో ప్రస్తావించడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యే ఆరోపించినట్లుగా ఒక్క సంఘటన కూడా చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. బాధ్యత లేకుండా చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.

దీనికి స్పందించిన శ్రీధర్‌బాబు.. తాను లేవనెత్తిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తప్పుంటే సరిదిద్దే స్వేచ్చ సభకు, ప్రభుత్వానికి ఉన్నాదని రిప్లై ఇచ్చారు. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. వాస్తవమే లేని ఆరోపణలు చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చి అలాంటిది జరగలేదని చెప్తున్నా ఎమ్మెల్యే రియలైజ్ కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వెనక్కి తీసుకోడానికి భేషజాలెందుకని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోనందున రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed