హుజూరాబాద్ ఎఫెక్ట్: మునుగోడులో TRS నేతలకు ఊహించని షాక్!

by Disha Web Desk 2 |
హుజూరాబాద్ ఎఫెక్ట్: మునుగోడులో TRS నేతలకు ఊహించని షాక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'ఓటుకు ఎంత..? ఎప్పుడిస్తారు..?' గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ నాయకులపై ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రులను సైతం వదలడం లేదు. మొహం మీదే అడిగేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో గులాబీ నేతలు అవాక్కవుతున్నారు. హుజూరాబాద్‌లో అమలు చేసిన ఫార్ములా.. మునుగోడులో అధికార పార్టీ మెడకు చుట్టుకున్నది. అక్కడ రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పంచారు. ఈ బై పోల్ లోనూ భారీ గా ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో.. గులాబీ లీడర్లు కనిపిస్తే చాలు 'ఎంతిస్తారు..? ఎప్పుడిస్తారు?' అంటూ నిర్మొహమాటంగా అడిగేస్తున్నారు.

షాక్‌లో మంత్రులు

ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన మంత్రులనూ ప్రజలు విడిచిపెట్టడం లేదు. ముందు సమస్యలు చెప్పుకున్నా.. ఓటుకు ఎంత ఇస్తారో చెప్పాలని అడుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఏం చెప్పాలో తెలియక మంత్రులు ఇబ్బంది పడ్తున్నారు. 'పింఛన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, మరి ఓటేస్తే రూ.20 వేలు ఇస్తారట కదా? నిజమేనా..?' అని అడుగుతున్నట్టు ప్రచారంలో ఉన్న ఓ మంత్రి తన అనుభవాలను వివరించారు. 'కేసీఆర్ పాలనపై చెప్పిందంత వింటున్నారు. ఆ విషయాలన్నీ తెలుసు. ఈ సారి ఓటుకు ఎంత ఇస్తారు.?' అని మహిళలు సైతం అడుగుతున్నట్టు ఆ మంత్రి అన్నారు.

ఓటర్లే అడగడం ఫస్ట్ టైమ్

రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ శక్తి మేరకు ఓటర్లకు డబ్బులు పంచాయి. కానీ హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఒక్కో ఓటుకు రూ. 6 వేల చొప్పున ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అంత మొత్తాన్ని కవర్లలో పెట్టి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఓటుకు పది వేలు కూడా పంచారు. ఆ ఇన్సిడెంట్స్ ను చూసిన మునుగోడు ఓటర్లు ఓటుకు ఎంతిస్తారని అడిగే పరిస్థితులు వచ్చాయని టీఆర్ఎస్ లీడర్లే చెప్తున్నారు.

బెడిసి కొట్టిన కేసీఆర్ వ్యూహం

హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని కసితో నాడు టీఆర్ఎస్ అక్కడ విపరీతంగా డబ్బులు పంచింది. దీంతో మునుగోడు ఓటర్లు డబ్బుల పంపిణీ కోసం ఆశగా ఎదురుచూస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితి ఓటర్లలో రావడానికి సీఎం కేసీఆర్ తీరే కారణమని సొంత పార్టీ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. 'నాడు హుజూరాబాద్ లో అంత మొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్లే ఇప్పుడు మునుగోడులో ఓటర్లు పైసల కోసం నిలదీస్తున్నారు.ఈ పరిస్థితికి మా సారే కారణం.' అని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

బ్రేకింగ్ న్యూస్.. మునుగోడుపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూసి కేసీఆర్, కేటీఆర్ షాక్



Next Story

Most Viewed