అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం

by Disha Web Desk 4 |
అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా‌లో గురువారం సాయంత్రం నుండి కురిసిన వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. సాయంత్రం ఆకాశం ఆకస్మికంగా మేఘావృతమై... ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రంలో నాలుగైదు రోజులపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికి... ఆ అంశాలు సాధారణ జనానికి చేరకపోవడంతో ఆకస్మికంగా కురిసిన వర్షాలు గాలులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

నీట మునిగిన ధాన్యం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలాలు, కల్లాలలో ఉన్న పంటలు, అమ్మకాల కోసం మార్కెట్లలోకి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. విక్రయాల కోసం ఉంచిన ధాన్యం, పల్లీలు వాన నీటికి కొట్టుకుపోయాయి. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. కోతకు వచ్చిన వరి పలుచోట్ల నేలకు ఒరిగింది. మామిడి, మిరప తోటలకు సైతం కొంత మేర నష్టం వాటిల్లింది. కాగా వర్షాలు మరో రెండు మూడు రోజులు ఉన్న కారణంగా గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు శుక్ర వారం నుండి రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు.

నాలుగు చోట్ల పిడుగుపాటు..ముగ్గురు మృతి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా నాలుగు చోట్ల పిడుగుపాటు సంభవించగా... ముగ్గురు మరణించారు. పెబ్బేరు మండలం పెంచికలపాడు వద్ద తమ గొర్రెలు మేపుతూ ఉన్న వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన వంగూరు బాలయ్య, లక్ష్మి దంపతులు, తమ కుమారుడు సందీప్‌తో కలిసి గొర్రెలను మేపుతుండగా.. వారికి సమీపంలో పిడుగు పడటంతో.. లక్ష్మి మరణించింది.

తండ్రి కొడుకులు ఇరువురు ప్రాణాలతో బయటపడ్డారు. బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామం వద్ద గొర్రెలను మేపుతున్న బాలకృష్ణ అనే యువకుడిపై పిడుగు పడటంతో అతను కూడా అక్కడికక్కడే మరణించాడు. గట్టు మండలం అరిగిద్ద గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు చాకలి జయన్న సైతం పిడుగుపాటుకు ప్రాణాలు వదిలాడు. తెలకపల్లి, బల్మూరు మండలాలలోనూ పిడుగుపాటు వల్ల రెండు ఎద్దులు మృతి చెందాయి.

జాతరలో తడిసిన తినుబండారాలు

ఊట్కూరు మండల సమీపంలో జరుగుతున్న శంకర లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో వర్షం వల్ల వ్యాపారస్తులు.. భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. గాలి తీవ్రత వల్ల టెంట్లు కూలిపోయాయి. తినుబండారాలు తడిసి పోవడంతో వ్యాపారస్తులు నష్టపోయారు. వివిధ పనులకు వెళ్లిన ఉద్యోగులు, కూలీలు సైతం అకాల వర్షాలతో ఇబ్బందులకు గురయ్యారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

Next Story

Most Viewed