తెలంగాణలో ఏడాదికి రెండు పంటలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
తెలంగాణలో ఏడాదికి రెండు పంటలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అన్ని జిల్లాలో రెండు పంటలు పండుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ మండలం కోడూరు గ్రామ క్లస్టర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాక ముందు విద్యుత్, సాగు నీరు లేక, బతుకు దెరువు కోసం రైతులు వలస వెళ్ళే పరిస్థితులు ఉండేవని, కూలీలుగా మారి పని చేసేవారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినాక అలాంటి పరిస్థితి నుంచి సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతుబీమా, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు, ఆసరా పెన్షన్ల లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో రైతులను, వృద్ధులను ఆదుకుంటున్నామని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో చెరువులు అలుగులు పారుతూ ఏడాదికి రెండు పంటలను పుష్కలంగా పండిస్తున్నామని, దేశంలో సగానికి పైగా 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తూ, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. రైతుల ఇంటి వద్దనే ధాన్యాన్ని కొనుగోలు చేసి, నేరుగా ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లోనే వేస్తున్నామని మంత్రి అన్నారు. త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతటా కాలువల ద్వారా నీటిని పారించి, సస్యశ్యామలం చేసి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చి దిద్ధుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్, డిఇఓ రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రాజేశ్వర్ గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed