- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ration cards: రేషన్ కార్డుల దరఖాస్తుల్లో ట్విస్ట్.. మీ సేవలో దరఖాస్తు చేసినా రసీదు ఆఫ్ లైన్ లో ఇవ్వాల్సిందే
మీ సేవలో దరఖాస్తు చేసినా రసీదు ఆఫ్ లైన్ లో ఇవ్వాల్సిందేనని మీసేవ నిర్వాహకులు చెప్పడం గందరగోళానికి దారి తీస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం మీసేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలు మీసేవ (Me Seva) కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దు నెలకొంది. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలోని పలు మీసేవా కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని క్యూ లైన్లలో నిల్చున్నారు. తమ దరఖాస్తులు సమర్పించేందుకు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. అయితే రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన రశీదును పౌరసరఫరాల శాఖ కార్యాలయం లేదా ఎమ్మార్వో కార్యాలయంలో సమర్పించాలని మీసేవ నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో అప్లికేషన్ రసీదులను పట్టుకుని సివిల్ సప్లై కార్యాలయాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు, సివిల్ సప్లై కార్యాలయం వద్ద భారీగా రద్దీ పెరిగింది. మీ సేవలో అప్లయ్ చేశాక మళ్లీ ఫిజికల్ గా రశీదులు ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. మీసేవ, సివిల్ సప్లై కార్యాలయాల వద్దరెండు చోట్ల గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్ల దందా:
రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రభుత్వం రూ.50 ఫీజును నిర్ణయించింది. అయితే ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇదే అదునుగా కొన్ని చోట్ల మీసేవ నిర్వాహకులు ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తిలోని ఓ మీసేవ లో రేషన్ కార్డు అప్లికేషన్ కోసం రూ. 2000 వేల వరకు వసూలు చేయడంతో ప్రజలు స్థానిక రాజకీయ నేతలను సంప్రదించారు. దీంతో నాయకులు వచ్చి ప్రజల వద్ద వసూలు చేసిన అదనపు చార్జీలను తిరిగి వెనక్కి ఇప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారి లైసెన్స్ లు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త దరఖాస్తులకు కావాల్సినవి ఇవే:
కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారు మీ సేవ సెంటర్లకు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుతో పాటు కరెంట్ బిల్ లేదా గ్యాస్ బిల్ తీసుకురావాలని మీసేవా నిర్వహకులు చెబుతున్నారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు అడుగుతున్నా అవి తప్పనిసరి కాదని చెబుతున్నారు. ఇక ఇదివరకే రేషన్ కార్డు ఉంటి ఫ్యామిలీలో ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులు ఇవ్వాలి. కాగా ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.






