TSPSC బోర్డు ప్రక్షాళన చేయాల్సిందే: అఖిలపక్ష పార్టీల డిమాండ్

by Disha Web Desk 19 |
TSPSC బోర్డు ప్రక్షాళన చేయాల్సిందే: అఖిలపక్ష పార్టీల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేసి కొత్త కమిటీ వేసిన తర్వాతే నియామక పరీక్షలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ, సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఆదివారం అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ - ప్రభుత్వ వైఫల్యంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పేపర్ లీకేజీ కో ఆర్డినేషన్ కమిటీ నేతలు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, టీజేఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మల్లు రవి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని మండిపడ్డారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సైతం సక్రమంగా నిర్వహించలేదన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదని, పాలకులకు సంబంధం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు అవ్వడంతో నిరుద్యోగులకు నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్య గోచరంగా మార్చిన ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో లీకేజీ ఘటనపై అన్ని పార్టీలతో సమావేశమై ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు వ్యాపార వ్యతిరేక పోరాట కమిటీగా పేరు అని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉంటాయన్నారు. త్వరలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహిస్తామని, గ్రామాల్లోకి వెళ్తామని స్పష్టంచేశారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. సీఎం ఒక్కడే తెలంగాణ సాధించినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంచి జరిగితే తన అకౌంట్‌లో.. చెడు జరిగితే ఇతరులపై వేయడం సరైంది కాదన్నారు. పేపర్ లీకేజీ ఘటనలో నిరుద్యోగుల సమస్యపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో పోరాట స్ఫూర్తి పోయిందని, ఏం చేసినా నడుస్తోందని ప్రభుత్వం అనుకుంటోందని విమర్శించారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, తర్వలో పోరాటాలకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు.

ప్రజా యుద్ధ నౌక గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ వేదనతో కుమిలిపోతోందన్నారు. నిరుద్యోగ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్ వర్డ్ ఎంత మంది దగ్గర ఉంటదని మండిపడ్డారు.

పేపర్ లీకేజీ విషయాన్ని చిన్నదిగా ప్రభుత్వం చూపించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. పేపర్ లీకులకు సంబంధించిన మూలాలు సీఎం కార్యాలయంలో నే ఉన్నాయన్నారు. అందరి తెలంగాణ కోసం మరో పోరాటం అవసరమని అభిప్రాయపడ్డారు. బలమైన ఐక్య వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గడీల పాలన పోవాలన్నారు. తెలంగాణను దోచుకున్న ప్రతి ఒక్కరు చంచల్ గూడ జైలుకు పోవాల్సిందేనని అన్నారు.

ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. కేవలం ఒక యూనివర్సిటీలోనే ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, ఏది ఏ పేపర్ అనేది కూడా యూనివర్సిటీ సభ్యులకు కూడా తెలిసే అవకాశం ఉండదన్నారు. అలాంటిది ఒక రాజ్యాంగ బద్దమైన కమిషన్‌లో ఇంకా ఎంత పకడ్బందీగా ఉండాలని అన్నారు. ఇంటర్వ్యూ ఎత్తివేయడం లోనే ఒక కుట్ర దాగి ఉందన్నారు. లీకేజీ భాదితులు క్వాలిఫై అయిన వారు మాత్రమే రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారని చెప్పారు.

ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ఇలా ఉంటే.. మిగతా డిపార్ట్ మెంట్‌లో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. లక్షల మంది విద్యార్థులు గోసను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. అన్ని రకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, సీపీఐ ఎంఎల్ నేతలు గోవర్ధన్, చలపతిరావు, ఇందిరాశోభన్, టీజేఎస్ నేతలు బైరీ రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బాల్మూరి వెంకట్, పీవైఎల్ కేఎస్ ప్రదీప్, వైజేఎస్ స్టేట్ ప్రెసిడెంట్ సలీం పాషా, పీడీఎస్‌యూ నాగేశ్వరావు, మహేష్, పరశురామ్, పీవోడబ్ల్యూ సంధ్య, ప్రజా సంఘాల నేతలు, గ్రూప్ - 1 అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed