షర్మిలపై టీఆర్ఎస్ మహిళా ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk |
షర్మిలపై టీఆర్ఎస్ మహిళా ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరని, కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ మాలోతు కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్‌పీలో ఆము ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమని, తెలంగాణను దోచుకోవడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందని విమర్శించారు. ఆంధ్రాలో పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు ఆడుతుందని, షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా... కేవలం వ్యక్తిగత విమర్శలతో షర్మిల దిగజారుతున్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. తెలంగాణలో షర్మిలకు కె.ఎ. పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణ వ్యతిరేకమేనని, మానుకోట ఘటనలో జగన్‌ను వంగపల్లి దాటనివ్వలేదని గుర్తు చేశారు. మేము షర్మిల పట్ల సంస్కారంతోనే ఉన్నాం కానీ.. షర్మిల మాట్లాడే పద్ధతి బాగలేదని కవిత అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. షర్మిల ప్రస్థానం ఎటు వైపు... ఏ లక్ష్యంతో మీరు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు షర్మిలను గౌరవించారు కానీ.. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయన్నారు. 2004లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ తండ్రి వైఎస్ కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారపి నిలదీశారు. పక్క రాష్ట్రం ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, మరి షర్మిల వాటిపై ఎందుకు అడగట్లేదన్నారు. షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడతామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ గురించి షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం షర్మిలకు ఇష్టం లేదని, ఇప్పుడు ఓదార్పు యాత్రలు ఏపీకి చాలా అవసరం... షర్మిల ఏపీలో ఓదార్పు యాత్ర చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని, మీకు లాగా దొంగ కేసులతో జైలుకు వెళ్లిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Also Read......

మూడు పార్టీలది రాజకీయ డ్రామా : జగ్గారెడ్డి



Next Story

Most Viewed