నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు ఎదురయ్యాయి. వీటికి తోడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్‌లతో సహా వివిధ అంశాల కారణంగా పెట్టుబడిదారులు లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు. అయితే, దేశంలో అనుకూల ఋతుపవనాల అంచనాల నేపథ్యంలో గ్రామీన ప్రాంతంలో డిమాండ్ పెరిగి అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని ఆశిస్తున్న కారణంగా ఎఫ్ఎంసీ రంగంలో కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 383.69 పాయింట్లు నష్టపోయి 73,511 వద్ద, నిఫ్టీ 140.20 పాయింట్లు క్షీణించి 22,302 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ 2 శాతానికి పైగా రాణించగా, బ్యాంకింగ్, మెటల్ సహా కీలక రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, టీసీఎస్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది.

Advertisement

Next Story