ఓటర్‌ల ముంగిటకు.. సకుటుంబ సపరివారం

by Disha Web Desk 23 |
ఓటర్‌ల ముంగిటకు.. సకుటుంబ సపరివారం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అమ్మ, నాన్న. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి,భార్య, బావమరిది,కొడుకు, కోడలు, బంధుగణం. ఇలా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సకుటుంబ సపరివారంగా సాగుతోంది.గతంలో పతుల కోసం సతులు... సతుల కోసం పతుల వరకే పరిమితమైన ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి అర్ధ,అంగ బలాన్ని ప్రదర్శించేందుకు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను ప్రచార రంగంలోకి దించుతున్నారు.


ఓటర్ల ముంగిటకు...

పార్లమెంట్ ఎన్నికలు సరికొత్త ప్రచారానికి వేదికయ్యాయి.అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటింటికి తిరుగుతున్నారు. వారిని గెలిపించండని ఓటర్లను ప్రాధేయ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులది ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఐక్య ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. స్థానికంగా అందరికీ పరిచయం ఉండే కుటుంబ సభ్యులతో పాటు.. బంధువులను ప్రచారంలోకి దించుతున్నారు. కుటుంబ సభ్యుల్లో కొందరు నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి కొందరు ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటున్నారు.




అభ్యర్థుల కోసం సకుటుంబం..

మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఆయన సతీమణి ఈటల జమున మహిళలతో కలిసి ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు.బీజేపీతోనే దేశం సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈటల రాజేందర్ ను గెలిపించాలని జమున విజ్ఠప్తి చేస్తున్నారు.ఈటల రాజేందర్ కొడుకు నితిన్ , కోడలు క్షమితా సైతం ఎన్నికల ప్రచారంలో బీజీ బిజీగా గడుపుతున్నారు. తన మామయ్యను గెలిపిస్తే మల్కాజ్ గిరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈటల కోడలు క్షమితా అభయమిస్తున్నారు.


అదేవిధంగా తల్లి పట్నం సునీత కోసం తనయ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పట్నం సునీత కోసం ఆమె కుమార్తె మనీషా రెడ్డి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తన తల్లి సునీతమ్మను గెలిపించాలని కోరుతున్నారు.అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన సతీమణి పట్నం సునీత ప్రచార బాధ్యతలు భుజాన వేసుకోని విస్తృతంగా లోక్ సభ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజనీ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కారు గుర్తుకు ఓటేసి తన భర్త రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.అదేవిధంగా కూతురు డాక్టర్ మౌనిక రెడ్డి, అల్లుడు భవనం అనిరుద్ రెడ్డి సైతం రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ఇతర బాధ్యతలు..

ఎన్నికలంటే .. ప్రచార ఏర్పాట్లు, కరపత్రాలు పంపిణీ,సభలు, సమావేశాల నిర్వహణ, కార్యకర్తలకు భోజన.. సోషల్ మీడియా విభాగం నడపడం ..ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడం ఇలా ఎన్నో పనులుంటాయి. నామినేషన్ పర్వం నుంచి పోలింగ్ వరకు బిజీ బిజీ . ఈ పనులన్నీ స్వయంగా చూసుకునే సమయం అభ్యర్థికి ఉండదు. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను నమ్మకస్తులైన బంధువులు, స్నేహితులకు అప్పగిస్తున్నారు.

Next Story

Most Viewed