గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

by Disha Web Desk 4 |
గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
X

దిశ, మెహిదీపట్నం : సంతానం కాని మహిళల కోసం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో జంట నగరాల నుంచి వేలాదిమంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే లంగర్ హౌస్ నుంచి అప్పా జంక్షన్ వరకు ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చాలామంది కార్లలో బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా కిక్కిరిసి వెళ్తున్నాయి. చిలుకూరులో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అర్చకులు గరుడ ప్రసాదం పంపిణీ చేసినట్లు సమాచారం.

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని అప్ప జంక్షన్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. మీటర్ కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదని వాహనదారులు వాపోతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ లో స్కూల్, కాలేజీ బస్సులు పెద్ద సంఖ్యలో ఇరుక్కుపోయాయి. మోయినాబాద్ ఏరియాలో 25కు పైగా విద్యాసంస్థలు ఉండగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించి పోలీసులు కూడా చేతులెత్తేసారని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed