అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలి: సోమేష్ కుమార్

by Disha Web Desk 11 |
అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలి: సోమేష్ కుమార్
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకాంక్షించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు సీనియర్ ఐఏఎస్ లు, ప్రొఫెసర్లతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ వస్తోందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో తప్ప మరి ఏ రాష్ట్రంలోనూ స్థానిక విద్యార్థులకు 95శాతం రిజిర్వేషన్లు లేవని గుర్తు చేశారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా యూనివర్శిటీ అధికారులు లైబ్రరీ, సెక్యూరిటీ, వైఫై ఇతర వసతులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెలకువలు నేర్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు పిలిచినా వచ్చి తరగతులు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నవీన్ మిట్టల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ బానోత్ రెడ్యానాయక్, ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed