బీజేపీలో టికెట్ ఫైట్.. కీలక నేతల మధ్య పొలిటికల్ వార్!

by Disha Web Desk 4 |
బీజేపీలో టికెట్ ఫైట్.. కీలక నేతల మధ్య పొలిటికల్ వార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. సుదీర్ఘ కసరత్తు అనంతరం బీజేపీ అధిష్టానం విడుదల చేసిన ఫస్ట్ జాబితాపై పార్టీలో అసంతృప్తి చిచ్చు రేగింది. అనేక మంది ఆశావహులకు నిరాశే మిగలడంతో వారంతా రెండో జాబితాలోనైనా తమ టికెట్‌ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ గాడ్ ఫాదర్‌లను రంగంలోకి దింపుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

కొడుకు కోసం రంగంలోకి విద్యాసాగర్ రావు!

రెండో జాబితాపై బీజేపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో పలు స్థానాల్లో తమ వర్గానికి టికెట్లు ఇప్పించేందుకు సీనియర్లు రంగప్రవేశం చేస్తున్నారు. వేములవాడ టికెట్‌ను ఇటీవలే పార్టీలో చేరిన తన తనయుడు వికాస్ రావు ఇప్పించేందుకు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్‌తో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక తన కుమారుడికి టికెట్ ప్రయత్నం ఉందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

మరో వైపు వేములవాడ టికెట్‌ను తుల ఉమకు కేటాయించాలని ఈటల పట్టుబడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు విషయంలో లక్ష్మణ్ వర్సెస్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ బీసీకి కేటాయించాలని లక్ష్మణ్ పట్టుపడుతుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఒక్క రెడ్డికి కూడా టికెట్ కేటాయించకపోవడంపై కొండా మనస్థాపం చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టికెట్ల విషయంలో పార్టీ తీరుపై కొండ అలకబూనినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

జనసేన ఎర్త్ ఎవరికో?

బీజేపీ తరపున టికెట్ ఆశిస్తున్న సీనియర్లకు పారాచూట్ నేతలు షాకిస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఫస్ట్ లిస్టులో ప్రాధాన్యత దక్కలేదని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. టికెట్ ఆశించి భంగపడిన వారిలో కొందరు పార్టీ మారేందుకు సిద్ధం అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ముథోల్ టికెట్ ఆశించిన రమాదేవి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. ఇక పలు సెగ్మెంట్లలో అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని లేకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు జనసేనతో పొత్తు కుదిరితే ఎవరి టికెట్‌కు ఎర్త్ పడుతుందో అన్న టెన్షన్ బీజేపీ నేతలను వేధిస్తోంది.



Next Story