కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ఫామ్ ఇదే.. కండిషన్లు ఇవే

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ఫామ్ ఇదే.. కండిషన్లు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని ఈ మేరకు అభ్యర్థుల వేట ప్రారంభించిన పార్టీ.. తాజాగా లోక్ సభ టికెట్ ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టికెట్ కోసం ఇవాళ్టి నుంచి అప్లికేషన్లను స్వీకరణ ప్రారంభం కాగా వచ్చే నెల 3వ తేదీ వరకు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లలో వీటిని స్వీకరించనున్నారు. ఈ మేరకు దరఖాస్తు ఫామ్ ను పార్టీ విడుదల చేసింది. ఇందులో దరఖాస్తు దారుని ప్రాథమిక వివరాలతో పాటు పార్టీలో చేరిన సంవత్సరం కాంగ్రెస్ పార్టీని మధ్యలో వీడితే తిరిగి ఎప్పుడు చేరారు అనే వివరాలను కోరింది. గత రెండేళ్లుగా చేపట్టిన ఇతర రాజకీయ కార్యక్రమాలతో పాటు రాజకీయ నేపథ్యంలో పార్టీలో ప్రస్తుత పదవి, గతంలో చేపట్టిన పదవులు వివరాలు నమోదు చేయాలని కోరింది. అలాగే ఎస్సీ, ఎస్టీ దరఖాస్తు దారులు వారి క్యాస్ట్ సర్టిఫికెట్ ను జతచేయాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఫీజు డిపాజిట్ కోరుతోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి రూ. 25 వేలు, ఇతరుల నుంచి రూ.50 వేల డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లో అభ్యర్థులకు పార్టీ పలు కండీషన్లు పెట్టింది.

రెబల్ గా పోటీ చేయనని డిక్లరేషన్:

అప్లికేషన్ ఫామ్ లో ఆశావహుల ముందు పార్టీ 17 డిక్లరేషన్లను పెట్టింది. పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనని డిక్లరేషన్ కోరింది. అలాగే నేను కట్నం తీసుకోను, ఇవ్వను అని, హింసకు తావు ఇవ్వకుండా, స్త్రీల గౌరవాన్ని నిలబెడతానని పార్టీ ప్రోటోకాల్ పాటించడంతో పాటు మత, కుల రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండనని కుల, మత భావాలను ప్రోత్సహించే ఎలాంటి సమావేశాలకు హాజరు కానని డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. ఏ క్రిమినల్ ఎలిమెంట్ తోనూ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండనని, ఎన్నికల తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో ఆస్తి రిటర్నులను, ప్రతి సంవత్సరం ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పిస్తానని తదితర అంశాలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే ఏఐసీసీ, వర్కింగ్ కమిటీ లేదా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు ద్వారా నిర్దేశించిన ఆదేశాలను అనుసరించడంతో పాటు పార్టీ జారీ చేసే విప్ లను పాటిస్తానని సంతకంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సంతకం చేసి అప్లికేషన్ ఇవ్వాలని కోరింది.

Next Story

Most Viewed