మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీలో ముసలం.. కీలక నేత సైలెంట్

by Disha Web Desk 4 |
మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీలో ముసలం.. కీలక నేత సైలెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికను ఆరునూరైనా గెలవాల్సిందేనని జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహరచనలో అధిష్టానం తలమునకలైంది. కాగా స్థానికంగా వాటిని అమలుచేసేందుకు నియమించిన మునుగోడు స్టీరింగ్ కమిటీలో ముసలం మొదలైంది. బైపోల్ లో అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించిన కమిటీ సమావేశం చప్పగా సాగినట్లు టాక్. నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో ఎలాగైనా గెలవాలనుకుంటున్న జాతీయ, రాష్ట్ర నాయకత్వం అంచనాలు నిజమవుతాయా? బెడసికొడుతాయా? అనేది అర్థంకాని పరిస్థితి నెలకొంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం తలనొప్పిగా మారే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.

మునుగోడు స్టీరింగ్ కమిటీ బాధ్యతలు మాజీ ఎంపీ వివేక్ కు అప్పగించడంతో జితేందర్ రెడ్డి వర్సెస్ వివేక్ అన్నట్లుగా నేతల కోల్డ్ వార్ సాగుతోంది. దుబ్బాక, హుజురాబాద్ బైపోల్ బాధ్యతలు జితేందర్ రెడ్డికి అప్పగించగా బీజేపీ గెలుపొందింది. దీంతో ఆయనది లక్కీ హ్యాండ్ గా నేతలు చెప్పుకున్నారు. కానీ మునుగోడు బాధ్యతలు ఆయనకు కాదని మాజీ ఎంపీ వివేక్ కు అప్పగించడంతో ఈ సమావేశంలో జితేందర్ రెడ్డి సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివేక్ కు, మాజీ మంత్రి చంద్రశేఖర్ కు కూడా పొసగడం లేదని టాక్. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే అయినా.. గతంలో నుంచే వారి మధ్య ఉన్న వైరం, సరైన సమన్వయంతో ఇమడలేక పోతున్నట్లు సమాచారం. వారికి తోడు ఈటల రాజేందర్ స్వామి గౌడ్ కు మధ్య కూడా అదే పరిస్థితి ఉందని సమాచారం. గతంలో చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డికి అవకాశం కల్పించడంతో ఈటల కీలక పాత్ర పోషించడంతో ఆయనకు దక్కే అవకాశాన్ని మరొకరికి ఇవ్వడంపై మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నిక కోసం 16 మంది స‌భ్యుల‌తో కూడిన స్టీరింగ్ క‌మిటీ తొలి సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో శనివారం నిర్వహించారు. కాగా ఈ మీటింగ్ లో నేత‌లు ఎడ‌మోహం.. పెడ‌మోహంగా వ్య‌వ‌హ‌రించినట్లు తెలుస్తోంది. స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్ వివేక్ వెంక‌ట‌స్వామి అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన స‌భ్యులు పలు సూచ‌న‌లు.. స‌ల‌హాలు చేసినా.. ఉప ఎన్నిక ఇన్ చార్జి ప‌ద‌విని ఆశించిన మాజీ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి మాత్రం స‌మావేశానికి హాజరై సైలెంట్‌గా కూర్చుని వెళ్లిపోయినట్లు సమాచారం. జంబో స్టీరింగ్ క‌మిటీ స‌మావేశం దాదాపు మూడు గంట‌లకు పైగా సాగినా స‌భ్యులు ఎవరి అభిప్రాయాల‌ను వారు వెల్ల‌డించినట్లు సమాచారం. హుజురాబాద్ లో అనుస‌రించిన వ్యూహాలను కూడా మునుగోడులో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించినట్లు పలువురు చెబుతున్నారు.

మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి కొద్ది రోజులుగా పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత లేదని అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. కాగా మునుగోడు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. జితేందర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ కావడంతో వివేక్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తనకు రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న వివేక్ కు ఇతర నేతలు సహకరిస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. కేంద్ర మంత్రులు ఎప్పుడెప్పుడు మునుగోడులో ప‌ర్య‌టించాలి, బ‌హిరంగ స‌భ‌లు ఎక్క‌డ పెట్టాల‌నే పలు అంశాలపై సైతం ప్రస్తావించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కమిటీలో ముసలం రాజుకున్న సమయంలో బీజేపీ నేత‌ల వ్యూహాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయి ? ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో మ‌నుగోడులో గెలిచి బీజేపీ బోణీ కొడుతుందా ? హుజూర్‌న‌గ‌ర్‌, నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక త‌ర‌హాలోనే బీజేపీ బోల్తా కొడుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరో రెండుమూడు రోజుల్లో కమిటీ సభ్యులు మరోసారి భేటీ కానున్నారు. అప్పటి వరకు పరిస్థితి సద్దుమణిగి అందరూ సమష్టిగా కలిసి పనిచేసి విజయానికి బాటలు వేస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే.


Next Story

Most Viewed