బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు..?

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పని చెబుతున్నాయి. బీజేపీ సైతం సిట్టింగ్ ఎంపీలపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలోకి పలువురిని చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చే యోచనలో ఉంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్‌తో పాటు రాములు సైతం కారు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే వారు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు బీబీ పాటిల్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయనతో పాటు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుతో సైతం భేటీ అయినట్లు తెలిసింది.

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో కారు దిగడం ఖాయమని దాదాపుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన తనయుడు భరత్ సైతం కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాములు కుమారుడు భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఆయనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని పలుమార్లు కోరినా పార్టీ పట్టించుకోకపోవడంతో ఇరువురు పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు.

తెరపైకి దిల్ రాజు పేరు

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరితే నాగర్‌కర్నూల్ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. కాగా రాములు మాత్రం తనకు టికెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, తన కుమారుడికి ఇచ్చినా చేరేందుకు సిద్ధమనే ప్రపోజల్ బీజేపీ నేతల వద్ద పెట్టినట్లు సమాచారం. బీబీ పాటిల్ కాషాయ పార్టీలో చేరితే ఆయనకు జహీరాబాద్ స్థానాన్ని ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీబీ పాటిల్ చేరకుంటే సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం ఇవ్వాలని కాషాయదళం ఆలోచనలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, త్వరలో జరిపే అవకాశముందని తెలుస్తోంది. కాగా బీబీ పాటిల్ సైతం త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ ఒకే అనుకుంటే నేడో రేపో ఆయన చేరే అవకాశాలున్నాయి.

పెద్దపల్లి బరిలో మిట్టపల్లి

తెలంగాణలో కనీసం 10 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. కాగా సిట్టింగ్ స్థానాలను వారికే కేటాయించి పార్టీ వీక్‌గా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి చేర్చుకుని గెలవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తెలుగు జానపద, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌ను పెద్దపల్లి బరిలో దింపాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈయన పాటలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆయనకు టికెట్ ఇస్తే ఒక కళాకారుడికి, ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చినట్లవుతుందనే కోణంలో పార్టీ ఆలోచన చేస్తోంది. కాగా పలువురు బీజేపీ నాయకులు మిట్టపల్లితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కాగా ఆయన టికెట్ కన్ఫామ్ చేస్తే పోటీకి సిద్ధమని వారికి క్లారిటీ ఇచ్చినట్లు టాక్. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? వారి వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది చూడాలి.

Also Read..

MP ఎన్నికల వేళ పీకల్లోతూ కష్టాల్లో బీఆర్ఎస్.. KCR ఎంట్రీ ఇవ్వకుంటే భారీ నష్టం తప్పదా..?




Next Story

Most Viewed