మద్నూర్‌ అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. కార్యకర్తల్లో టెన్షన్

by Disha Web Desk 4 |
మద్నూర్‌ అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. కార్యకర్తల్లో టెన్షన్
X

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. మండలంలోని అధికార పార్టీకి చెందిన క్రియాశీలక నేతలు ఒకరికి మధ్య మరొకరికి అంతర్గత విభేదాల కారణంగా విడిపోయి వర్గాలుగా ఏర్పడిన నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఓ వర్గం నేతతో తనకు ప్రాణహాని ఉందంటూ మరో వర్గం నేత బహిరంగంగానే విమర్శించడంతో మండలంలోని పార్టీ కార్యకర్తల మధ్య అయోమయం నెలకొంది.

ఏ వర్గం వైపు ఉండాలో ఎవరికి మద్దతు ఇయాలో అర్థం కాక కార్యకర్తలు సతమతమవుతున్న పరిస్థితి మద్నూర్ మండలంలో నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన బీఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఒక వర్గం వారు పాల్గొంటే మరో వర్గం వారు గైర్హాజరు అయ్యారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నేతల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు మదనపడుతున్నప్పటికీ ఇరువురు నేతలు మాత్రం తగ్గేదేలే అంటూ ఎవరి పంతాన్ని వారు నెగ్గించుకుంటున్నారు.

పార్టీకి కష్టపడి అన్ని విధాల సహాయపడే నేతను విమర్శిస్తున్నారు అంటూ ఒక వర్గం వాదించగా గ్రూపుల మధ్య తగాదాలు పెడుతూ పార్టీలో చిచ్చులు పెడుతున్న నేతకు మద్దతిస్తున్నారు అంటూ మరో వర్గం విమర్శించడం గమనార్హం. ఇంతటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య పార్టీ భవితవ్యం ఏమిటని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అంతే కాకుండా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపోటములను నిర్ణయించేంత ఓటు బ్యాంక్ కలిగిన మండలంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నేతల మధ్య వర్గ విభేదాలు సద్దుమడుగుతాయా లేక ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా కొనసాగుతాయా ఇలాంటి పరిస్థితి గనక కొనసాగితే అధికార పార్టీకి ఇబ్బంది అంటూ ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించి నేతల మధ్య సయోధ్య కుదుర్చాలి అని పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed