నేషనల్ జ్యూట్ బోర్డును తరలించొద్దు.. బోర్డు ఆఫీస్ ఎదుట మహిళల నిరసన

by Disha Web Desk 13 |
నేషనల్ జ్యూట్ బోర్డును తరలించొద్దు.. బోర్డు ఆఫీస్ ఎదుట మహిళల నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ జ్యూట్ బోర్డును కలకత్తా కు తరలించొద్దని మహిళలు డిమాండ్ చేశారు. దేశంలోని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం జ్యూట్ సీడ్‌ను ఎగుమతి చేస్తున్నా బోర్డును తరలించే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. బుధవారం హైదరాబాద్‌లో చేనేత భవన్‌లో ఉన్న నేషనల్ జ్యూట్ బోర్డు కార్యాలయాన్ని కలకత్తా కు తరలించే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేస్తూ ధరిత్రి జూట్ అండ్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చెందిన మహిళలకు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నేషనల్ జ్యూట్ బోర్డులో సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. నేషనల్ జ్యూట్ బోర్డు ను 1997లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారని, ఈ బోర్డులో తెలంగాణ, ఏపీ, డయ్యూ డామన్, గోవా, మహారాష్ట్రకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. జ్యూట్ ఎగుమతుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.

అంతేగాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 20 వరకు జ్యూట్ కంపెనీలు ఉన్నాయన్నారు. బోర్డును కలకత్తా కు తరలిస్తే చిన్నతరహా పరిశ్రమల వారికి ఇబ్బందులు తప్పవన్నారు. స్వయం ఉపాధిని సైతం కోల్పోయే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని బోర్డు తరలింపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధరిత్రి జూట్ అండ్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నాగ జయ సరిత, మమత, ఇష్రత్, నవీన్, యాదగిరి, షకీల్, షహానా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed