11 లక్షల ఎకరాల పోడు పట్టాలివ్వాల్సిందే.. సర్కార్‌కు గిరిజన సంఘం వార్నింగ్

by Disha Web Desk 19 |
11 లక్షల ఎకరాల పోడు పట్టాలివ్వాల్సిందే.. సర్కార్‌కు గిరిజన సంఘం వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 24 నుంచి 30 తేదీ వరకు పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఒకే విడతలో 11 లక్షల ఏకరాల పోడు భూములకు హక్కు పట్టాలివ్వాలని లేకపోతే మరో పోరాటానికి సిద్ధం అవుతామని తెలంగాణ గిరిజన సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పాల్గొని ప్రసంగించారు.

సుదీర్ఘకాలం గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగానే పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. పోడు రైతులపై పెట్టిన కేసులన్నిటిని బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే 11 లక్షల ఎకరాల పోడు భూములకు మొదటి విడతలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొంత మంది గిరిజనులకు హక్కుపత్రాలు ఇచ్చి చేతులు దులుపు కావాలని చూస్తే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లాలనుంచి అందిన సమాచారం మేరకు కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు.

శాటిలైట్ మ్యాపులను చూపెట్టి వేలాదిమంది పోడు రైతుల దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. జూన్ 5 నుంచి నెలరోజుల పాటు పోడు భూముల ప్రాంతాల్లో పర్యటించి ఎంఆర్వో, కలెక్టర్లకు మెమొరాండాలు ఇవ్వాలని, పోడు హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొని గిరిజనులకు సక్రమంగా హక్కు పత్రాలు అందే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. దశాబ్ద ఉత్సవాల్లోనే గిరిజన బంధును ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జూన్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలుపాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు మెమొరాండాలు ఇవ్వాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై జూలైలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed