దళిత 'బంద్'.. ఒక్క పైసా రిలీజ్ చేయని సర్కారు!!

by Disha Web Desk 2 |
దళిత బంద్.. ఒక్క పైసా రిలీజ్ చేయని సర్కారు!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. కానీ, రాష్ట్ర ఆర్థికశాఖ మాత్రం ఒకేసారి రూ.17,700 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేసింది. కానీ ఆచరణలో మాత్రం దానికి సంబంధించిన డబ్బు విడుదల కాలేదు. ఆర్థిక సంవత్సరంలో సగం కాలం పూర్తయినా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో అటు ఎస్సీ సంక్షేమ శాఖ, ఇటు లబ్ధిదారులు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఈ పథకం కోసం ప్రభుత్వం విడుదల చేసింది. రూ.3,850 కోట్లలో 38,411 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3,841 కోట్లు జమ అయ్యాయి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి మాత్రం ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడం గమనార్హం.

గతేడాది ఈ పథకం లాంఛింగ్ సందర్భంగా హుజూరాబాద్ సహా మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, వాసాలమర్రి గ్రామంలో పూర్తిస్థాయిలో, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత నెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో దళితబంధు అమలుపైన చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నుంచి ప్రతీ నియోజకవర్గంలో 1500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింప చేయాలని కేబినెట్ సమావేశం తీర్మానించింది.

ఆ ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి రూ.150 కోట్ల చొప్పున మొత్తం 118 చోట్ల రూ.17,700 కోట్లు అవసరమవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క నియోజకవర్గానికి కూడా సర్కారు నుంచి డబ్బులు రిలీజ్ కాలేదు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఆ నియోజకవర్గంలోని మొత్తం దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. గతేడాది తరహాలోనే ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి సరిపోయేలా ఒకేసారి రూ. 1,180 కోట్లను లేదా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో సగం చొప్పున విడుదల చేస్తే బాగుంటుందని ఎస్సీ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ భావించింది. ఆ మేరకు అధికారుల స్థాయిలో చర్చలు జరిపింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

ఒకవైపు జీతాలకు సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒకేసారి రూ. 17,700 కోట్లను విడుదల చేయగలుగుతుందా అనే చర్చ అధికారుల స్థాయిలోనే మొదలైంది. ఎలాగూ ఆరు నెలల వ్యవధి పూర్తయినందున మిగిలిన ఆరు నెలల కాలానికి ఇన్‌స్టాల్‌మెంట్లలో రిలీజ్ చేస్తుందా అనే సందేహం నెలకొన్నది.

ఈలోపు మంత్రివర్గ సమావేశం ఒక్కో నియోజకవర్గంలో 1500 మంది చొప్పున దళితబంధు సాయాన్ని అందించాలని నిర్ణయించినా నిధుల విడుదల విషయంలో మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇప్పటికి ఆరు నెలలు పూర్తయినా ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడంతో ఆ స్కీమ్ అమలు ఎక్కడి గొంగళి అక్కడి తరహాలోనే ఉండిపోయింది. గతేడాది అమలుచేసిన కారణంగా లబ్ధిపొందిన 38,511 మంది లబ్ధిదారులు మినహా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు చివరి వరకు కొత్తగా ఎవ్వరికీ నిధులు జమ కాలేదు.

లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఎంపిక తదితరాలన్నీ పూర్తయినా నిధులు విడుదల కాకపోవడంతో యూనిట్లను గ్రౌండ్ చేయడానికి ఆస్కారం లేకుండాపోయింది. ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 25 నాటికి మొత్తం 38,411 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమకాగా, ఇందులో 35,309 మంది యూనిట్లను ప్రారంభించి పనులు చేసుకుంటున్నట్లు తేలింది.

గతేడాది హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో దళితబంధును అమలుచేసేలా పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గంలోని 18,211 దళిత కుటుంబాలకు తలా రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. అది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయింది. ఆ తర్వాత వాసాలమర్రి గ్రామంతో పాటు మరో నాలుగు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మండలం చొప్పున 'శాచ్యురేషన్ మోడ్' విధానంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఖమ్మం జిల్లాలోని చింతకాని, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ నాలుగు నియోజకవర్గాల్లోని మండలాల్లో మొత్తం 8,390 దళిత కుటుంబాలను ప్రభతువం గుర్తించింది. వీరిలో 8,315 కుటుంబాలకు రూ. 839 కోట్ల నిధులు విడుదలయ్యాయి. సెప్టెంబరు చివరి నాటికి 7,280 మంది లబ్ధిదారుల యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంతో కలిపి ఈ నాలుగు మండలాలకు పూర్తి స్థాయిలో పథకాన్ని అమలుచేసేలా మొత్తం 26,676 మందిని గుర్తిస్తే అందులో కేవలం 74 మంది మినహా మిగిలిన 26,602 మందికి డబ్బుల పంపిణీ పూర్తయింది. ఈ ఏడాదికి మొత్తం 118 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో చోట 1500 మంది చొప్పున మొత్తం 1.77 లక్షల మందికి నిధులు ఎప్పుడు విడుదలవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.



Next Story