వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్

by Dishafeatures2 |
వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఈ రోజు నుంచి మే 8 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. టీఎస్పీస్సీ పేపర్ లీక్ ను నిరసిస్తూ లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి వైఎస్ షర్మిల సిట్ ఆఫీస్ కు బయలుదేరగా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కాలినడకనే సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల రోడ్డుపై బైఠాయించారు. తనను ఆపడానికి మీరెవరు అంటూ షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఏ పని లేకుంటే గాడిదలు కాసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తనకుందని, తనను ప్రగతి భవన్ కు వెళ్లనీయాలని పోలీసులను కోరారు.

అయితే అందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఆగ్రహించిన షర్మిల.. అక్కడి నుంచి ముందుకు నడుస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ లేడి కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నారు. అదేంటని ప్రశ్నించిన పోలీస్ అధికారిని కూడా షర్మిల పక్కకు తోశారు. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన షర్మిలపై 353, 332, 509, 427 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఎలాంటి వారెంట్ లేకుండా షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారని షర్మిల తరఫు లాయర్లు వాదించారు. షర్మిలను తాకేందుకు పోలీసులు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఆత్మ రక్షణ కోసం ఆమె పోలీసులను నెట్టివేసిందని షర్మిల తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. కాగా కేసు విచారణ చేపట్టిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం తిరిగి కేసు విచారణ చేపట్టిన కోర్టు.. షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు.



Next Story

Most Viewed