శ్రీనివాస్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.. Revanth Reddy (అనుముల రేవంత్ రెడ్డి) బహిరంగ లేఖ

by Disha Web Desk |
శ్రీనివాస్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.. Revanth Reddy (అనుముల రేవంత్ రెడ్డి) బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వం చేతగాని తనంతో నిజాయితీ పరుడైన ఒక అధికారి ప్రాణాలు కోల్పోయాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోందని ఆరోపించారు. పోడు రైతుల సమస్యలపై బుధవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య నిత్యం చిచ్చు రేగుతోందని అన్నారు. ఇందులో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ హత్యకు గురికావడం బాధాకరం అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే అని.. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా పోడు భూములపై హక్కులు కల్పిస్తామని లబ్ధిదారులను ఊరిస్తూ.. మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని గిరిజనుల పైకి అధికారులను ఎగదోస్తు ప్రభుత్వం చోద్యం చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వాకం వల్లే అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై కేసులు పెట్టారని అన్నారు. అంతేకాకుండా కొంత మంది ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై దాడులకు దిగారని రేవంత్ ఆరోపించారు.

2018లో ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలు అటకెక్కించారని రేవంత్ మండిపడ్డారు. పోడు రైతులు పోరాటాలు చేస్తు్న్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహించారు. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేండ్లయిందని అన్నారు. మంత్రి సత్యావతి రాథోడ్ చైర్ పర్సన్ గా ఒక కమిటీ నియమించి దాదాపు 14 నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక అటవీ అధికారి ప్రాణాలు కోల్పోవడంతో పాటు గొత్తికోయలు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గొత్తికోయలు చేసింది ముమ్మాటికి తప్పేనని అందుకు వారిని శిక్షించాల్సిందేనని అన్నారు. కానీ, పోడు భూముల అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని అన్నారు.

అంతేకాకుండా, ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణ చేపట్టాలని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. విధులు నిర్వహిస్తు్న్న అధికారులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని అన్నారు. లేని పక్షంలో టీకాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరన ప్రకటిస్తాం అని రేవంత్ హెచ్చరించారు.


Next Story

Most Viewed