వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరం: గవర్నర్ తమిళిసై

by Disha Web Desk 2 |
వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరం: గవర్నర్ తమిళిసై
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ మెడికల్ కళాశాలలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ స్వయంగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి తెలుసుకున్నారు. ఆమెకు అందుతున్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి ఆరా తీశారు. ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్న తీరుపైనా అడిగి తెలుసుకున్నారు. ఒక సీనియర్ స్టూడెంట్ నుంచి ఎదురైన వేధింపులతోనే ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరమని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం తమిళిసై సౌందర్‌రాజన్ మీడియాతో మాట్లాడుతూ, చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నదన్నారు. ఒక వైద్య విద్యార్థినికి ఇలాంటి ఘటన ఎదురుకావడం దురదృష్టకరమన్నారు. వైద్య విద్య చదివే విద్యార్థినులు ధైర్యంగా ఉండాలన్నారు.

ప్రీతి ఆత్మహత్యా యత్నం ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలని, పోలీసులు క్షుణ్ణంగా అంశాలను విశ్లేషించాలన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని తెలిపారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని వ్యాఖ్యానించారు. వైద్యులు అన్ని రకాల ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, కానీ వాటికి స్పందన నామమాత్రంగా కూడా లేదన్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కాలేజీలో చదువుతున్న ఆమె తోటి విద్యార్థులు కొద్దమంది చాలా బ్రైట్ స్టూడెంట్ అని, బాగా చదుతుందని, ధైర్యంగా కూడా ఉంటుందని చెప్పినట్లు గవర్నర్ గుర్తుచేశారు. అయినా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన పరిస్థితి ఎదురుకావడం బాధకరమని, సీనియర్ వేధించడం దారుణమన్నారు.

ప్రీతి తల్లిదండ్రులతోనూ గవర్నర్ మాట్లాడి గతంలో కాలేజీ వాతావరణం గురించి చేసిన ఫిర్యాదులు, భయపడుతున్నట్లు షేర్ చేసుకున్న వివరాలపై గవర్నర్ ఆరా తీశారు. డాక్టర్లు వారి శక్తి మేరకు కృషిచేస్తున్నారని, ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని వారికి ఆమె భరోసా ఇచ్చారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ కోర్సు ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ప్రీతి సీనియర్‌ స్టూడెంట్ వేధింపులు తట్టుకోలేక బుధవారం తెల్లవారుజామున సూసైడ్ ప్రయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ వేధింపుల గురించి కళాశాల, ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సంతృప్తికరమైన చర్యలు లేవని ఆమె తల్లితండ్రులు ఆరోపించారు. కానీ అలాంటి వేధింపులేవీ లేవని అధికారులు ఖండించారు.



Next Story