నేతన్న జీవితాలతో సర్కార్ చలగాటం.. ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 15:43:20  IST  )

మగ్గాన్నే నమ్ముకున్న చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభంలో పడ్డారని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేతన్న జీవితాలతో సర్కార్ చలగాటం.. ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: మగ్గాన్నే నమ్ముకున్న చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభంలో పడ్డారని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally)లో స్థానిక చేనేత కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. మగ్గాన్ని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న వీరి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూలు సబ్సిడీ (Yarn Subsidy), థ్రిఫ్ట్ స్కీం (Handloom Savings Scheme), నేతన్నకు చేయూత వంటి ముఖ్యమైన పథకాలను కొనసాగించకుండా ప్రస్తుత ప్రభుత్వం నేతన్న నడ్డి విరిచిందని ఆరోపించారు.

అంతేకాకుండా, చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. కొందరికి మాత్రమే రుణమాఫీ అయిందని.. కానీ వారు లక్షల్లో ఉన్నారని అన్నారు. ఈ రేవంత్ సర్కారుకు చేనేత కార్మికుల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నూలు సబ్సిడీ, థ్రిఫ్ట్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి చేనేత కళ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వ సహకారం, ప్రోత్సహాం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నార. ప్రభుత్వం తక్షణమే స్పందించి, చేనేత కార్మికులకు న్యాయం చేయాలని.. వారి డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కవిత హెచ్చరించారు.

Next Story