ప్రతి పౌరునికి మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Thanuru Gopichand |

రాష్ట్రంలో‌ ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

ప్రతి పౌరునికి మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో‌ ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో భాగంగా "అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో కూడిన, సమానమైన వైద్యం" అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘హెల్త్ విజన్-2047’ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు.

మూడంచెల వైద్యం.. మౌలిక వసతుల కల్పన..

ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు మూడంచెల విధానాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,023 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రాథమిక సేవలు, 184 టీవీవీపీ ఆసుపత్రుల ద్వారా స్పెషలైజ్డ్ సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 35 బోధనాసుపత్రులు, 13 స్పెషాలిటీ ఆసుపత్రులతో తృతీయ స్థాయి వైద్యాన్ని పటిష్టం చేశామన్నారు. 2 వేల పడకలతో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, రూ.1698 కోట్లతో నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ (1750 పడకలు), హైదరాబాద్ నలువైపులా మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించారు. మెడికల్ టూరిజం పాలసీతో తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో 'అఫర్డబిలిటీ'కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, ఫలితాలను డిజిటల్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఇందులో రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చామని గుర్తు చేశారు.

100 శాతం ప్రసవాలు హాస్పిటల్స్‌లోనే..

మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, దాదాపు 100 శాతం ప్రసవాలు హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. క్యాన్సర్ బాధితుల కోసం ప్రతి జిల్లాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉచితంగా కీమోథెరపీ అందిస్తున్నామన్నారు. డయాలసిస్ కేంద్రాల విస్తరణ, ట్రామా కేర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్‌లు వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, టెలి- మెడిసిన్ సేవలతో సాంకేతికతను జోడిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బడ్జెట్‌లో 4 శాతంగా ఉన్న వైద్య రంగ కేటాయింపులను 2047 నాటికి 8 శాతానికి పెంచుతామని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మంత్రి ఆకాంక్షించారు. మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని, ఏటా లక్ష మంది విదేశీయులు హైదరాబాద్‌లోని హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇక్కడి హాస్పిటళ్లతో పాటు, ఇక్కడికి వచ్చే పేషెంట్లను కాపాడుకునే బాధ్యత, వారు దోపిడికి గురికాకుండా కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి, యూనిసెఫ్ రీజినల్ హెడ్ డాక్టర్ జెలాలెం బిర్హాను, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ శాంత అచంట, అపోలో జేఎండీ డాక్టర్ సంగీత రెడ్డి, కిమ్స్ సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story