మణిపూర్ ఘర్షణలకు బాధ్యత కేంద్రానిదే

by Dishanational2 |
మణిపూర్ ఘర్షణలకు బాధ్యత కేంద్రానిదే
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన తెగలు, ఇతర ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి అమాయక ప్రజల హత్యలకు కారణమైందని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని ఆదివాసి గిరిజన సంఘం, ఆవాజ్, తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం పూసం సచిన్ అధ్యక్షతన ఆదివాసీ గిరిజన, మైనార్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మనిపూర్ ఘర్షణలకు కేంద్రమే బాధ్యత వహించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మణిపూర్ లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఆ రాష్ట్రంలో ఆదివాసీలు, ఇతర ప్రజలను విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం 40 శాతంగా కూకీ, నాగ, మీజో వంటి 31 గిరిజన తెగలకు స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆ హామీని అమలు చేయకుండా ఆదివాసీలకు మోసం చేసిందని ఆరోపించారు. 2023లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం కోసం 54 శాతంగా ఉన్న మెహితి ప్రజలను ఎస్టీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.

మెహితి ప్రజలను గిరిజన తెగల జాబితాలో కలపడమంటే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు ఉన్న హక్కులను పూర్తిగా కాలరాయడమేననిఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలో నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో భూమిపై, ఇతర వనరులపై ఆదివాసీ తెగలకే హక్కులున్నాయని తెలిపారు. మైదాన ప్రాంతంలో ఉన్న 54 శాతం మెహితి ప్రజలకు ఆదివాసీ ప్రాంతమైన షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు కల్పించేందుకు బీజేపీ తీర్మానం చేయడం వల్లనే ఘర్షణకు కారణమైందని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొనే విధంగా గిరిజన తెగల్లో మెయితీ ప్రజలను కలుపుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్,సత్తార్. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సామాజిక కార్యకర్త సురేష్ పులిగుజ్జు, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మెస్రం రాజు, శ్రీను. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, గిరిజన సంఘం నాయకులు ఎం బాలు, ఆర్ పాండు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed