హాట్ టాపిక్‌గా ఆ ఐఏఎస్‌ల తీరు.. బదిలీ అయినా కార్లు హ్యాండోవర్ చేయని వైనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-28 02:30:45  IST  )

రాష్ట్రంలోని ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయిన తర్వాత సైతం సంబంధిత శాఖల వెహికిల్స్ వెనక్కి ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హాట్ టాపిక్‌గా ఆ ఐఏఎస్‌ల తీరు.. బదిలీ అయినా కార్లు హ్యాండోవర్ చేయని వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయిన తర్వాత సైతం సంబంధిత శాఖల వెహికిల్స్ వెనక్కి ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని వెనక్కి ఇవ్వాలని పలుసార్లు మెమోలు జారీ చేసినా స్పందించడం లేదని తెలుస్తున్నది. బదిలీపై ఇతర చోటుకు వెళ్లినప్పుడు ఆ కార్యాలయంలో వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. కానీ సదరు ఐఏఎస్‌లు మాత్రం పాత ఆఫీసు వెహికిల్స్‌తో పాటు కొత్త ఆఫీసు వెహికల్స్‌నూ ఉపయోగిస్తూ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

స్ట్రిక్ట్ ఆఫీసర్‌కు ఇదేం ఖర్మ

సెక్రెటేరియట్‌లో పనిచేసే ప్రతి ఐఏఎస్ ఆఫీసర్‌కు ప్రభుత్వం ఫార్చునర్ కారును సమకూర్చడం సహజం. ఐఏఎస్ హెచ్ఓడీ విభాగం నుంచి సెక్రెటేరియట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన తరువాత వారికి జీఏడీ.. వెహికల్ సమకూర్చింది. సచివాలయంలో పనిచేసిన ఓ ఏఐఎస్.. సుమారు ఐదు నెలల క్రితం దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడికి వెళ్లిన తరువాత జీఏడీ సమకూర్చిన వెహికిల్‌ను వెనక్కి ఇవ్వలేదు. కలెక్టరేట్‌కు చెందిన వెహికల్‌తో పాటు సెక్రెటేరియట్ వాహనం సైతం ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆ ఐఏఎస్‌కు స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా, కేవలం రూల్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారని టాక్. అంతటి పేరున్న ఆఫీసర్.. కారు విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటనే విషయంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెహికిల్‌ను వెనక్కి ఇవ్వాలని పలుసార్లు గుర్తు చేసినా స్పందించకపోవడం ఏంటీ? అని ఆరా తీస్తున్నారు.

అక్కడ ఉంటే అది.. ఇక్కడుంటే ఇది!

కొత్తగా పోస్టింగ్ వచ్చిన చోట అక్కడ ప్రభుత్వం ఇచ్చే వాహనాన్ని ఉపయోగిస్తున్న అధికారులు.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇక్కడి వెహికల్స్‌ను వాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే పాత వెహికిల్‌ను వెనక్కి ఇవ్వడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య జరిగిన బదిలీల్లో స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌కు నార్త్ ఇండియాలో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇక్కడున్న వాహనాన్ని ఉపయోగిస్తున్నారని, అందుకే జీఏడీ నుంచి ఎన్నిసార్లు గుర్తుచేసినా వెహికిల్‌ను వెనక్కి ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతున్నది.

Next Story