ఇంటర్ మూల్యాంకనానికి టెండర్లు.. బోర్డు మరోసారి సంచలన నిర్ణయం

by Disha Web |
Inter Board
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫలితాల్లో గ్లోబరీనా అనే సంస్థకు టెండర్లు అప్పగించడం ద్వారా జరిగిన అవకతవకలతో ఎంతో మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ బాధను తట్టుకోలేక ఎంతోమంది మరణించారు. 2019లో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కాగా, బోర్డు మరోసారి అలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీవాల్యుయేషన్‌కు స్క్రిప్ట్స్, ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఏజెన్సీని ఎంపిక చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది.

2022-23 నుంచి 2024-25 వరకు మూడు అకడమిక్ ఇయర్స్‌కి కలిపి టెండర్లను ఆహ్వానించింది. ఎంపికైన ఏజెన్సీని మూడేండ్ల పాటు కొనసాగించనున్నారు. బిడ్డర్లు ఈ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ http://tender.trlangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులు పంపించాలని బోర్డు సెక్రటరీ తెలిపారు. బుధవారం నుంచి ఈ టెండర్లు ప్రారంభమయ్యాయి. బిడ్ దాఖలుకు వచ్చేనెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు తాజా నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఇలాంటి నిర్ణయంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఈసారి కూడా గ్లోబరీనా సంస్థకే బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం పలువురు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాల్సిందే.


Next Story