తెలంగాణ ఆర్థిక రథ సారధులు ‘MSME’లు... 17.22 లక్షల యూనిట్లతో సేవల రంగం జోరు

by Kema Shiva Kumar |

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల విప్లవం మొదలైంది. 17.22 లక్షల యూనిట్లతో ఉపాధి కల్పనలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

తెలంగాణ ఆర్థిక రథ సారధులు ‘MSME’లు... 17.22 లక్షల యూనిట్లతో సేవల రంగం జోరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం ఆధారిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా సోషియో ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. ఉపాధి సృష్టి, పారిశ్రామిక ఉత్పత్తి పెంపు, ఎగుమతుల విస్తరణలో ఎంఎస్ఎంఈలు ప్రధాన శక్తిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఔత్సాహికతకు పునాది వేస్తూ సమగ్ర, సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. 2025 డిసెంబర్ 22 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17,22,031 ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదయ్యాయి. వీటిలో 13,74,100 యూనిట్లు(79.8 శాతం) సేవల రంగంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం ఆధిక్యతను స్పష్టంగా చూపుతున్నది.

రాష్ట్ర స్థూల విలువ పెరుగుదలలో కీలక పాత్ర

2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల విలువ పెరుగుదలలో సేవలు, దాని ఉపరంగాల పాత్ర గణనీయంగా ఉంది. రియల్ ఎస్టేట్, డ్వెల్లింగ్ యాజమాన్యం, ప్రొఫెషనల్ సేవలు కలిపి 23.4 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి. ట్రేడ్, రిపేర్, హోటల్స్, రెస్టారెంట్ల రంగం 20.8 శాతం వాటాను నమోదు చేసింది. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసార సేవలు 8.4 శాతం, ఇతర సేవలు 8.6 శాతం, ఫైనాన్షియల్ సర్వీసులు 5 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2.4 శాతం వాటా కలిగి ఉన్నాయి. సేవల ఉపరంగాల వృద్ధిరేటు పరంగా.. ట్రేడ్, రిపేర్, హోటల్స్, రెస్టారెంట్ల రంగం 16.8 శాతం వృద్ధితో ముందంజలో నిలిచింది. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ సేవలు 14.1 శాతం, ఇతర సేవలు 13.1 శాతం, ఫైనాన్షియల్ సర్వీసులు 12.2 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 11.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 5.9 శాతం వృద్ధితో మితమైన పెరుగుదల కనబరిచింది. ఈ గణాంకాలు రాష్ట్రంలో వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్ వంటి సేవల రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ సేవలు, లాజిస్టిక్స్, ఈ-కామర్స్ అభివృద్ధితో సేవల రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.

గ్రామాల్లోనూ ప్రోత్సహించాలి..

రాష్ట్రవ్యాప్తంగా గణాంకాలను గమనిస్తే ఇప్పటివరకు హైదరాబాద్‌కే ప్రాధాన్యత దక్కతున్నట్లుగా తెలుస్తోంది. గ్రామీణ, గిరిజన జిల్లాల్లో సేవల రంగ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రాంతీయ అసమానతలు సైతం తగ్గే అవకాశం ఉన్నదని అంటున్నారు. సమతుల అభివృద్ధి సాధనలో సేవల రంగం కీలక పాత్ర పోషించనుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం ప్రధాన ఇంజిన్‌గా మారింది. నగరాల్లో ఉన్న బలమైన వ్యాపార వాతావరణాన్ని ఇతర జిల్లాలకు విస్తరించే విధంగా విధానాలు అమలు చేస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగం అందుకునే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, కుమురంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ వంటి గ్రామీణ, గిరిజన జిల్లాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య తక్కువగా నమోదైంది. ఈ ప్రాంతాల్లో సేవల రంగ వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడమే కాక ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

జిల్లాల వారీగా ఎంఎస్ఎంఈ యూనిట్లు

1 హైదరాబాద్ - 2,38,879

2 రంగారెడ్డి-1,63,776

3 మేడ్చల్–మల్కాజిగిరి - 1,21,568

4 నల్గొండ - 64,723

5 నిజామాబాద్ - 58,302

6 కరీంనగర్ - 51,875

7 ఖమ్మం - 49,164

8 సంగారెడ్డి - 46,594

9 సిద్దిపేట - 38,249

10 సూర్యాపేట - 38,113

11 మహబూబ్‌నగర్ - 38,036

12 హనుమకొండ - 37,362

13 వరంగల్ - 36,415

14 భద్రాద్రి కొత్తగూడెం - 29,060

15 మంచిర్యాల - 29,038

16 జగిత్యాల - 27,245

17 యాదాద్రి భువనగిరి - 25,469

18 కామారెడ్డి - 25,331

19 వికారాబాద్ - 23,914

20 మెదక్ - 23,829

21 పెద్దపల్లి - 23,490

22 ఆదిలాబాద్ - 22,740

23 నిర్మల్ - 20,752

24 నాగర్‌కర్నూల్ - 20,741

25 మహబూబాబాద్ - 20,471

26 రాజన్న సిరిసిల్ల - 19,860

27 వనపర్తి - 16,122

28 జనగాం - 15,060

29 జోగులాంబ గద్వాల్ - 12,521

30 కుమురం భీం ఆసిఫాబాద్ - 11,082

31 జయశంకర్ భూపాలపల్లి -9,446

32 నారాయణపేట - 9,358

33 ములుగు - 5,515

మొత్తం - 17,22,031

Next Story