TG: గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసులు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

TG: గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసులు..  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా తమపై జరుపుతున్న దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు భీకర స్థితికి చేరుకోవడంతో యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై తమ వారిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల పట్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి.. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రజలు ఎక్కువగా జీవనోపాధి కోసం దుబాయ్, ఖతార్, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న జగిత్యాల ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

పశ్చిమ ఆసియా ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం మరియు సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ల్యాండ్‌లైన్ నెంబర్ 011-23380556‌కు అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ వందర బరువా +91 98719 99044, లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్ +91 96437 23157, పీఆర్వో సీహెచ్ చక్రవర్తి +91 99493 51270 నెంబర్లలో అందుబాటులో ఉండనున్నారు.

Next Story