న్యూ ఇయర్‌‌లో మరింత హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం!

by Disha Web Desk |
న్యూ ఇయర్‌‌లో మరింత హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరంలో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. అధికార బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకుపోవడాని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఐదు విడతల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలవాలనే టార్గెట్‌తో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో త్వరలో ఆయన బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జనవరి 16 నుంచి బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు వీధి సభలు, అసెంబ్లీ స్థాయి సమావేశాలకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికలపై కమల దళం నజర్ వేసింది. అగ్రనేతలకు పలు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను అప్పజెప్పిన పార్టీ.. తాజాగా పలు నియోజకవర్గాలకు సీనియర్ నేతలకు పాలక్ లుగా నియమించింది.

ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ నడుమ నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో కీలకమైన నేతలు బీజేపీ గూటికి చేరబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత చేరికల పర్వం జోరందుకునే చాన్స్ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు కాషాయ కండువా కప్పుకోగా వచ్చే ఏడాది అధికార పార్టీ నుంచి వలసలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.

ప్రజాక్షేత్రంలోకి రేవంత్ రెడ్డి

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కొత్త యేడాది జోరు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి పూర్వ వైభం తీసుకురావాలని భావిస్తున్నాడు. జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని తెలుస్తోంది. అయితే అదే సమయంలో పార్టీ అధిష్టానం హాత్ సే హాత్ జోడో అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ రెండు పాదయాత్రలు ఒకటేనా లేక రేవంత్ రెడ్డి సపరేట్ గా పాదయాత్ర కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. చాలా కాలంగా పాదయాత్ర విషయంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు పార్టీ పెద్దల నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీఆర్ఎస్‌ను ఇరకాటంలో నెట్టేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది. దీంతో అధికార పార్టీని మరింత ఇరుకున పెట్టేలా హస్తం చక్రం తిప్పబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టి.. ఎన్నికల మూడ్ లోకి పార్టీని, కార్యకర్తలను తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

గులాబీ బాస్ ముందు భారీ సవాళ్లు

వచ్చే ఏడాది ప్రారంభం నుంచే బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ ఎటాక్ ప్రారంభించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే అధికార గులాబీ పార్టీకి ఇంటి పోరు సమస్యగా మారుతోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం నానాటికి బహిర్గతం అవుతోంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి సహకరించడం లేదని ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపించగా తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వీరయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ముసుగు వేసుకుని కొందరు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలు సొంత పార్టీ నేతలను ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతోంది. తాను ఎన్నడూ దొంగ రాజకీయాలు, ముసుగు రాజకీయాలు చేయనని, కొంత మంది మాత్రం సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

అయితే ఇటీవల మంత్రి మల్లారెడ్డి వ్యవహారంతో అధికార పార్టీలో బహిర్గతం అయిన గ్రూప్ పాలిటిక్స్ రోజు రోజుకు పెరుగుతాయే తప్ప తగ్గవనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే నేతల మధ్య ఆధిపత్య పోరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరింత చికాకు కల్గించే వ్యవహారంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత విచారణ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్వయంగా కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై ఆరోపణలు రావడంతో అధికార పార్టీకి రాబోయే కాలం మరింత క్లిష్టతరంగా మారబోతోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న కేసీఆర్ కు కొత్త ఏడాదిలో ఇటి సొంత పార్టీ నేతల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నానేది ఆసక్తిగా మారింది.

Also Read:

HYD : న్యూఇయర్ వేళ పబ్ నిర్వాహకులకు హై కోర్టు షాక్


Next Story

Most Viewed