డీఎంఈ కి 'కత్తెర'..! కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

by Disha Web Desk 4 |
డీఎంఈ కి కత్తెర..! కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్​ ఎడ్యుకేషన్ ​డైరెక్టర్ అధికారాలకు అతి త్వరలో కత్తెర పడనున్నది. వైద్య, విద్య విభాగంలో మానిటరింగ్ చేసేందుకు కొత్తగా ముగ్గురు అడిషనల్​ డీఎంఈలను నియమిస్తున్నారు. వీరిలో ఒకరికి కొత్త, పాత మెడికల్ ​కాలేజీల్లో విద్య,సిబ్బంది మెయింటనెన్స్​, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు .మెడికోల స్టైఫండ్‌, రీసెర్చ్ ప్రోగ్రాం, ప్రొఫెసర్లు క్లాసులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం వంటివి పర్యవేక్షిస్తారు. మరోకరు అన్ని మెడికల్​ కాలేజీల్లో ట్రీట్మెంట్​ తీరును నిత్యం పరిశీలించనున్నారు. ట్రీట్‌మెంట్ సరిగా అందించడం, ఆపరేషన్ల సంఖ్య పెంచడం, మార్నింగ్, ఈవినింగ్ ఓపీ సరిగా నిర్వహించడం, డ్యూటీ హవర్స్‌లో డాక్టర్లు హాస్పిటళ్లలో ఉండకపోతే యాక్షన్ తీసుకోవడం వంటి పనులన్నింటినీ పర్యవేక్షించనున్నారు.

కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను, పర్మిషన్లు, రిక్రూట్​మెంట్​ బాధ్యతలను మరో అడిషనల్​డీఎంఈ తీసుకోనున్నారు. అయితే ఆయా విభాగాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్​ కేటాయింపులు తదితరవన్నీంటిని విభాగాల వారీగా ఈ ముగ్గురు అడిషనల్​ డీఎంఈలే ఉత్తర్వులు, జీవోలు జారీ చేయనున్నారు. సబ్జెక్ట్​ల వారీగా సమీక్షల్లోనూ పాల్గొననున్నారు. దీంతో ఇక ప్రస్తుతం ఉన్న డీఎంఈ డా.రమేష్​రెడ్డి కేవలం మానిటరింగ్​ కే పరిమితం కానున్నారు. ఇప్పుడున్నట్లు అన్నింటిపై పూర్తి స్థాయి అధికారాలేవీ ఉండవు. డీఎంఈ డా రమేష్​రెడ్డిని మార్చాలంటూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. సీనియర్​ ప్రోఫెసర్ల నుంచి కూడా ప్రతీ రోజు వ్యతిరేకత వస్తున్నది. జునియర్​గా ఉన్న వ్యక్తిని డీఎంఈ పోస్టులో ఇకెంత కాలం ఉంచుతారని స్వయంగా ప్రభుత్వం వైద్యుల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సర్కార్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ''హెల్త్​ మినిస్టర్ హరీష్​రావు​పేషీలోని ఓ అధికారి ఆఫ్​ది రికార్డు''లో తెలిపారు.

దవాఖాన్లు బాగుపడేందుకే...

డీఎంఈని డమ్మి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, మెడికల్​ కాలేజీల్లో మెరుగైన సేవలు కోసం తీసుకున్నామని ప్రభుత్వం పైకీ చెప్పడం గమనార్హం. ప్రతీ రోజు డాక్టర్ల నుంచి వస్తున్న విమర్శలతో మంత్రి, ఆయన పేషీ ఆఫీసర్లు కూడా డీఎంఈని మార్చాలని ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నారు. కానీ సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో మంత్రి కూడా డీఎంఈ మార్పులో ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది. కానీ పదే పదే డీఎంఈ పోస్టు అంశం వివాదాలకు వస్తుండటంతో సీనియర్ ​ప్రోఫెసర్లను సంతృప్తి పరిచేందుకు అడిషనల్ ​డీఎంఈలకు కొత్త బాధ్యతలను అప్పగిస్తున్నారు. వీరంతా కోఠిలోని వైద్య, విద్య హెడ్​ ఆఫీస్​లోనే విధులు నిర్వర్తించనున్నారు. సపరేట్​ ఛాంబర్లు, వాహనాలను కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆయా విభాగాలకు అంతర్గత ఆదేశాలూ ఇచ్చింది. ఇటీవల ఏడీఎంఈలుగా ప్రమోషన్లు పొందిన వారికి ఈ పోస్టులు వర్తించనున్నాయి.


Next Story

Most Viewed