టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్.. గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్

by Disha Web Desk 2 |
టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్.. గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే నెలల వ్యవధిలోనే పరిస్థితిలో ఎంతో మార్పు కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో పాటు పార్టీ అధిష్టానం ఒంటెద్దుపోకడలను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ బీఆర్ఎస్‌కు బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉప్పల్ టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్‌లోకి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇప్పటికే ఆయన కలువడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడమే మిగిలి ఉందనే టాక్ అంతటా వినబడుతోంది. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఆకర్ష్ కార్పొరేటర్స్..?

గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో మెజార్టీ సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మార్పులు, చేర్పులు పోనూ బల్దియాలో 52 మంది బీఆర్ఎస్, 42 మంది ఎంఐఎ, 40 మంది బీజేపీకి 40 కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 11 మంది కార్పొరేటర్ల బలం మాత్రమే ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం పట్టు నిలుపుకుంది. అయితే త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ పార్టీ నాయకులు ఊహించని షాక్‌లు ఇస్తుండడం కారు పార్టీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా మెజార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్‌లోకి వెళ్లడం బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో పార్టీ పట్ల గుర్రుగా ఉన్న నాయకులను గుర్తించి వారికి నచ్చచెప్పి పార్టీ మారకుండా నష్టనివారణ చర్యలు ఆ పార్టీ చేపడుతోంది.

టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్..

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి స్థానాలను హస్తగతం చేసుకునేందుకు చూస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పర్యాయం ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం కాంగ్రెస్ ఖాతాలోనే ఉండగా ఇక్కడి నుంచి గత లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించిన రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. దీనిని కూడా చేజారిపోకుండా పార్టీ భారీ మెజార్టీ సాధించే దిశగా చూస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే టాక్ వినబడుతోంది. హైదరాబాద్ పార్లమెంట్‌లో కూడా పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధి ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో వాటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుండగా బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ నేతలు పార్టీ మారకుండా పడరానిపాట్లు పడుతున్నాయి.



Next Story

Most Viewed