యూత్, నిరుద్యోగులే టార్గెట్‌గా టీ- కాంగ్రెస్ భారీ స్కెచ్..!

by Disha Web Desk 19 |
యూత్, నిరుద్యోగులే టార్గెట్‌గా టీ- కాంగ్రెస్ భారీ స్కెచ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో ముందుకు పోతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న యువతపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రియాంకాగాంధీ చేతుల మీదుగా యూత్ డిక్లరేషన్‌ను రిలీజ్ చేసింది. సిక్స్ గ్యారంటీస్‌లో యువ వికాసం పేరుతో రూ.5 లక్షల విద్యా భరోసా కార్డునూ ప్రకటించింది. త్వరలో విడుదల చేయనున్న మేనిఫెస్టోలో సైతం యూత్, నిరుద్యోగులు, స్టూడెంట్స్ కోసం మరిన్ని హామీలు ఇవ్వనున్నది.

కొన్ని నెలలుగా నిరుద్యోగులు, డీఎస్సీకి గతంలో హాజరైన అభ్యర్థులు, కాంట్రాక్టు ఉద్యోగులుతో పాటు కొన్ని సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ నేతలను కలిసి ప్రస్తుత ప్రభుత్వంలో నెరవేరని హామీల గురించి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వంపై వీరందరికీ తీవ్రమైన అసంతృప్తి ఉన్నదనే భావనతో వారి అంశాలను టేకప్ చేయాలని హస్తం పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, జీవో 371తో చిక్కులు ఎదుర్కొంటున్న వారూ కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు.

వీరి సమస్యలను పార్టీ పరిగణనలోకి తీసుకున్నది. ఏయే సెక్షన్ల ప్రజలు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారో తెలుసుకొని వారికి చేరువ కావాలని నిర్ణయించుకున్నది. డీఎస్సీ కోరుకుంటున్న వారు సుమారు 6 లక్షల మందికంటే ఎక్కువగా ఉన్నారని, గ్రూప్స్ కోసం ప్రయత్నిస్తున్న వారు దాదాపు 30 లక్షల మంది ఉన్నారన్నది ఆ పార్టీ అంచనా. ఎలాగూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారే సుమారు 25 లక్షల మందికి పైగా ఉన్నారని ఆ పార్టీ అంచనా వేసింది.

నిరాశలో నిరుద్యోగులు

రాష్ట్రంలో సుమారు 81 వేల పోస్టులు భర్తీ చేస్తామని గతేడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ నేటి వరకూ భర్తీ చేయలేదు. దీంతో నిరుద్యోగులు, అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ మొదలు రకరకాల రీజన్స్‌తో ఆ ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉండడంతో ఎప్పటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వస్తాయనే డైలమా నెలకొన్నది.

యూత్‌పైనే కాంగ్రెస్ ఫోకస్

ఇప్పటికే రెండు దఫాలుగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. గాంధీభవన్‌లో గురువారం సైతం కొద్ది మంది డీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు ప్రకటించారు. కొంతకాలం క్రితం వరకూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందనే వాతావరణం కనిపించింది.

ఆ సమయంలోనే నిరుద్యోగులు, యూత్‌పైన దృష్టి పెట్టిన బీజేపీ.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల జీవో 317 జీవోలోని బదిలీల అంశాన్ని టేకప్ చేసింది. దీక్షలు నిర్వహించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుకూ దారితీసింది. కానీ మారిన రాజకీయ పరిణామాల్లో బీజేపీ డీలా పడడంతో కాంగ్రెస్ మాత్రమే అధికార పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయమనే అభిప్రాయం నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో నెలకొన్నది.

ఆ కారణంగానే వారు తమ సమస్యలను కాంగ్రెస్ పార్టీకి మొరపెట్టుకుంటున్నారు. వారి నుంచి వచ్చిన రిక్వెస్టులను పార్టీ నాయకులు సీరియస్‌గా తీసుకొని వాటిని పరిష్కరించేలా నిర్దిష్టమైన హామీ ఇస్తే వారిని ఆకర్షించొచ్చని అనుకున్నారు. ఆ ప్రకారమే గతంలో యూత్ డిక్లరేషన్‌లో, ఆ తర్వాత సిక్స్ గ్యారంటీస్‌లో స్పష్టమైన హామీలను ప్రకటించారు. త్వరలో వెలువరించనున్న మేనిఫెస్టోలో సైతం కొన్ని వాగ్దానాలు ఇవ్వనున్నారు.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌

కాంగ్రెస్ తాను ప్రకటించబోయే మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించడం, మెగా డీఎస్సీ నిర్వహించడం, ఖాళీ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వడం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడం..లాంటివి పెట్టాలని భావిస్తున్నది. రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజల ఆకాంక్షలు, ఆశలకనుగుణంగా సర్వేలో వెల్లడయ్యే అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోకు రాష్ట్ర, కేంద్ర నాయకులు తుది మెరుగులు దిద్ది ప్రకటించనున్నారు. గతంలో బీజేపీ నేతలు సైతం ‘యూత్ ఓట్లు మాకు పడితే గెలుపు ఖాయం.. పవర్‌లోకి రావడమూ అంతే గ్యారంటీ’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే అభిప్రాయంతో ఉన్నది.


Read More..

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 60 మందితో తొలి జాబితా..!

Next Story

Most Viewed