హ్యామ్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

by Ajay Maddhiboyina |

హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు బలోపేమవుతాయని, దాంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ హ్యామ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు.

హ్యామ్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు బలోపేమవుతాయని, దాంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ హ్యామ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా గ్రామీణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడతాయని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ ఈ శుక్రవారం విడుదల కానుందని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫేజ్1 లో 17 ప్యాకేజీల కింద, 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కిలోమీటర్ల పొడవుతో) నిర్మించనున్నామని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ ర‌హదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని సూచించారు.

రహాదారి కనెక్టివిటి పెంచేందుకు హ్యామ్ పద్దతిలో నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నుండి మండల కేంద్రం, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం, జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర కేంద్రం వరకు రహదారి కనెక్టివిటీని పెంచేందుకు హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్) పద్ధతిలో నిర్మాణం, అప్‌గ్రేడేషన్‌, నిర్వహణ చేపట్టేందుకు సంక‌ల్పించింది. ఈ విధానంలో లో ప్రాజెక్ట్ వ్యయానికి 40 శాతం ప్రభుత్వమే నిర్మాణ దశలో చెల్లిస్తుంది, మిగిలిన 60 శాతం మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే అవుతుంది.

మూడు దశల్లో ప్రాజెక్టు:

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఫేజ్1 కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా ప్రతిపాదిత ప‌నుల‌ను పంచాయ‌తీ రాజ్ ఇంజ‌నీర్లు ఎంపిక చేశారు. కేబినెట్ ఇప్పటికే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ (పీఆర్ఈడీ) ప్రతిపాదనలు ఆమోదించింది. ప్రభుత్వం 17 ప్యాకేజీలుగా పీఆర్ ఇంజ‌నీరింగ్ డిపార్ట‌మెంటు సర్కిళ్ల వారీగా పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్ట్ యొక్క మొత్తం అంచనా వ్యయం రూ. 6,294.81 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక అనుమతి మంజూరైంది. దీంతో ఫేజ్1 హ్యామ్ రోడ్ల‌ టెండర్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులిచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 17 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఈ శుక్రవారం నుంచే ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ జోగా రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అదే రోజున పేపర్ నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి, టెండర్ ప్రక్రియ పూర్తైన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Next Story