క్రేన్లు కూలిన ఘటన.. కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన కంపెనీ

by Naga Rani Yarlagadda |

శంకరపల్లిలోక్రేన్లు కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కంపెనీ భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది.

క్రేన్లు కూలిన ఘటన.. కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలం మహాలింగాపురంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాద బాధితులకు ఎన్​సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలుల కారణంగా క్రేన్లు కూలి ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు వలస కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ విషాద ఘటనపై కంపెనీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన చేసిన సూచనకు కంపెనీ సానుకూలంగా స్పందించింది. మృతులకు ప్రకటించిన పరిహారంతో పాటు, ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున తక్షణ సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు భద్రతా వైఫల్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం కొంత ఊరటనిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story