సీన్​ రిపీట్... సర్కార్​ ఆసుపత్రులకు వస్తే సచ్చుడేనా..?

by Disha Web Desk |
సీన్​ రిపీట్... సర్కార్​ ఆసుపత్రులకు వస్తే సచ్చుడేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాసుపత్రులపై భరోసా పెంచాలనే మంత్రి హరీష్​రావు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నాయి. ప్రతీ నెల రివ్యూలు పెడుతూ పనితీరును మెరుగుపడేలా ప్లాన్​చేస్తున్నా.. ఫలించడం లేదు. కొందరు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో సర్కారీ ఆసుపత్రులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. కొంత మంది డాక్టర్లు, స్టాఫ్​పేషెంట్లను పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సకాలంలో సరైన వైద్యం అందక పేషెంట్లు నరకం చూస్తున్నారు. హైకోర్డు సూచించిన వైద్యశాఖలో మార్పు రావడం లేదు. గత కొన్ని రోజుల నుంచి సర్కార్​ఆసుపత్రులలో వరుస సంఘటనలతో ప్రజలు షాక్‌లో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రిపోర్టులు, వివిధ విభాగాల్లోని పారమీటర్లు చూసి గొప్పలు చెప్పుకుంటున్నది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవనడానికి గడిచిన కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ప్రతీ ఆసుపత్రిలో పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతుంటే, అన్ని దవాఖాన్లలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కానీ ప్రజల ప్రాణాలు మాత్రం పోతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు మాత్రం రివ్యూలకే పరిమితం అవుతున్నారు. పోయిన ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యతనేది ప్రశ్నార్ధకంగా మారింది?

బాలింతలు మృతి

శుక్రవారం మలక్​పేట్​ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నాగర్ కర్నూల్​జిల్లా వెల్దండి మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల, సైదాబాద్‌కు చెందిన శివానిలను ప్రసవం కోసం మలక్​పేట్​ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యం అందించడంలో జాప్యం, సిబ్బంది నిర్లక్ష్యం వలన ఇద్దరు బాలింతలు చనిపోయారని బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ చాదర్ ఘాట్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒకే రోజు ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులలోని రోగులు కలవరం చెందుతున్నారు

మరి కొన్ని ఘటనలు ఇలా....

ఈ నెల 24న జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు ఓ గర్భిణీ కాన్పు కోసం వెళ్లగా, డెలివరీకి ఇంకా టైమ్ ఉందంటూ డాక్టర్లు ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. ఆరోగ్యపరిస్థితి సీరియస్​గా ఉన్నదని చెప్పినా, వైద్యసిబ్బంది సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు పంపినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ మహిళకు నొప్పులు ఎక్కువై రోడ్డుపైనే ప్రసవించింది.

నవంబర్‌‌లో నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను ఓ వ్యక్తి కారులో హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. అక్కడి సిబ్బందికి, డాక్టర్లకు పరిస్థితి సీరియస్ ఉందని చెప్పినా పట్టించుకోలేదు. దాదాపు అరగంట సేపు నొప్పులతో ఇబ్బంది పడిన ఆ మహిళ కారులోనే ప్రసవించింది. చివరకు స్థానికుల ఆగ్రహంతో అడ్మిట్​ చేసుకొని వైద్యం అందించారు.

జగిత్యాల ఎంసీహెచ్​సెంటర్‌లోనూ ఇటీవల డెలివరీ తర్వాత ఆరుగురు మహిళలకు ఇన్​ఫెక్షన్​ప్రబలింది. డాక్టర్లు సరిగ్గా పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుటుంబీకులు ఆరోపించారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం మమత, అసిఫాబాద్‌ జిల్లాకు చెందిన బొల్లం పావని కాన్పు కోసం మంచిర్యాల దవాఖానలో చేరారు. ఇద్దరికీ డాక్టర్లు సిజేరియన్​ చేశారు. ఒకరికి బాబు, మరొకరికి పాప పుట్టారు. పిల్లాడిని తీసుకెళ్లి మమత కుటుంబ సభ్యులకు, పాపను పావని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత నర్సులు వచ్చి మీకు బాబు కాదు.. పాప పుట్టిందని చెప్పారు. బాబు పావనికి పుట్టాడని, మమతకు పాప పుట్టిందన్నారు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. చివరకు ఈ ఇష్యూ పోలీస్​ స్టేషన్​వరకు వెళ్లి డీఎన్ఏ టెస్టులు వరకు చేరింది.

నిమ్స్ నిర్లక్ష్యం..

నిమ్స్​ ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం గుండె సమస్యతో ఓ పేషెంట్‌ కార్డియాలజీ విభాగానికి వచ్చాడు. ఆపరేషన్​చేయాలని నిర్ధారించిన డాక్టర్లు... ఆ తర్వాత ఆపరేషన్ లేట్​చేస్తూ వచ్చారు. కుటుంబ సభ్యుల రిక్వెస్ట్​మేరకు ఒప్పుకున్న డాక్టర్లు నడుస్తూ వెళ్లిన పేషెంట్‌ ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయాడని ప్రకటించారు. నిమ్స్‌లో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి. డాక్టర్ల మధ్య కోల్డ్ వార్​కూడా పేషెంట్ల అసౌకర్యానికి కారణంగా మారాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్ల బురుజు, ఎంజీఎం ఆసుపత్రులలోనూ ఎలాంటి మార్పులు రాలేదని స్వయంగా అదే ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్​చెప్పడం గమనార్హం. మంత్రి రివ్యూలు, విజిట్‌ల సమయంలో హడావిడి చేస్తూ ఆయా ఆసుపత్రి అధికారులు మంత్రిని కూడా మోసం చేస్తున్నారని ఓఆర్ఎంవో ఆశ్చర్య పోయే విషయాన్ని వెల్లడించారు. ఇక ఫర్మామెన్స్​రిపోర్టులు కూడా తప్పులేనని ఆయన నొక్కి చెప్పారు.

Next Story

Most Viewed