అమేథీ బరిలో రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!

by Swamyn |
అమేథీ బరిలో రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మక స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలపై గురువారం సైతం సస్పెన్స్ వీడలేదు. ఈ స్థానాలకు గురువారమే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించగా, అది జరగలేదు. ఈ అంశంపై పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీలు సుదీర్ఘంగా చర్చించినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. అయితే, ఐదో దశలో భాగంగా ఈ నెల 20న రెండు స్థానాలకు పోలింగ్ జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే చివరిరోజు. దీంతో శుక్రవారమే అభ్యర్థులను ప్రకటించి, ఆ వెంటనే నామినేషన్లు వేయించనున్నారు. కాగా, ఈ రెండు స్థానాలకు గాంధీ కుటుంబం నుంచి అభ్యర్థులను నిలబెట్టడంపై రాహుల్ వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే, పార్టీ చీఫ్ ఖర్గే మాత్రం ‘గాంధీ’లనే నిలబెడుదామని రాహుల్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల పోస్టర్‌లు వేయడం గమనార్హం. దీంతో ఇప్పటికే కేరళలోని వయనాడ్ బరిలో ఉన్న రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి సైతం పోటీ చేస్తారని, రాయ్‌బరేలి నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారని పోస్టర్లను బట్టి తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు మాత్రం శుక్రవారమే తెలియనున్నాయి.


Advertisement

Next Story

Most Viewed