బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఆమె స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవడం మంచిదికాదని అన్నారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ వెళ్లకపోవడం బాధకరమన్నారు. తాను గవర్నర్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్, సీఎం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, గత కొన్ని నెలలుగా తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా పరిస్థితులు మారిన విషయం తెలిసిందే. ప్రోటోకాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు బహిరంగంగా గవర్నర్ విమర్శలు చేయగా.. పెండింగ్ బిల్లులు విషయంలో గవర్నర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు విమర్శలు గుప్పించారు. ఇలా రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు గ్యాప్ ఏర్పడింది. దీంతో కొన్ని రోజులు గవర్నర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం వంటివి ఘటనలు చోటు చేసుకున్నాయి.

గవర్నర్ కొన్ని విషయాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడం కూడా బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ విషయంపై బీఆర్ఎస్ మంత్రులకు, గవర్నర్‌కు మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని గవర్నర్ కామెంట్ చేయగా.. రాష్ట్ర వైద్యాఆరోగ్య మంత్రి హరీష్ రావు కూడా గవర్నర్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రాజ్ భవన్‌కు ప్రగతి భవన్ మధ్య కాస్త గ్యాప్ తగ్గినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడిచింది.

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్, గవర్నర్ ఒకే వేదికపై కలవడం, పలకరించుకోవడం.. అలాగే రాజ్ భవన్‌లో జరిగిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ఏడాది తర్వాత రాజ్ భవన్‌లో అడుగుపెట్టడంతో వీరి మధ్య విభేదాలు కాస్త తగ్గినట్లు కనబడింది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కూడా ఇటీవల గవర్నర్ తమిళి సై ఆమోదం తెలపడం ఈ వార్తలకు కాస్త బలం చేకూర్చింది.

ఇదిలా ఉండగానే.. గవర్నర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. విభేదాలు తగ్గినట్లు ప్రచారం జరుగుతోన్న వేళ గవర్నర్ చేసిన తాజా కామెంట్స్‌తో వీరి మధ్య ఇంకా గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతున్నదని తెలుస్తోంది. ఇక, గవర్నర్ లేటేస్ట్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

Next Story