ఖర్గే ముందుకు టీ-కాంగ్రెస్ పంచాయతీ.. TPCC చీఫ్‌పై ఫిర్యాదుల వెల్లువ!!

by Disha Web Desk 2 |
ఖర్గే ముందుకు టీ-కాంగ్రెస్ పంచాయతీ.. TPCC చీఫ్‌పై ఫిర్యాదుల వెల్లువ!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్‌లో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఖర్గేతో భేటీ అయ్యారు. ప్రధానంగా రేవంత్ వ్యవహరిస్తున్నతీరును ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది.

మమ్మల్ని కలుపుకుపోవడం లేదు

హస్తం పార్టీలో ఏడాదిన్నర నుంచీ విభేదాలు తగ్గడం లేదు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు పార్టీ నేతల్లో మరింత ఆజ్యం పోశాయి. కొంతమంది బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం వచ్చిన ఓట్లను సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికలకు పార్టీలో మార్పులు అవసరమంటూ ఇటీవల పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన మరో వర్గం హస్తినకు వెళ్లింది. ఏఐసీసీ చీఫ్​ ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో మార్పులు, చేర్పులు ఉంటాయని, టీపీసీసీ, డీసీసీల్లో కూడా మార్పులు ఉంటాయని ఢిల్లీ నుంచే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఢిల్లీ బాటపట్టారు. టీపీసీసీ అనుబంధ సంఘాల బాధ్యులను మార్చుతున్నట్లు చర్చ జరుగుతుండటంతో దీనిపై ఖర్గేతో చర్చించినట్లు సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సైతం మార్చే అవకాశం ఉందని గాంధీభవన్‌లోనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే, ఇటీవల టీపీసీసీ జగ్గారెడ్డి సైతం ఓవైపు రేవంత్.. మరోవైపు భట్టిపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది.

మార్పులపై మాకూ చెప్పండి

టీపీసీసీ, డీసీసీల మార్పులు అనివార్యమనే సంకేతాల నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు ఖర్గే ముందు గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే రేవంత్​రెడ్డి కనుసన్నల్లోనే మార్పుల జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా డిసెంబర్​4 తర్వాత ఈ అంశాలపై కీలక మార్పులు ఉంటాయని కూడా సమాచారం. దీనిపై పార్టీలోని సీనియర్లు ఖర్గేకు పలు విజ్ఞప్తులు చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాలు, టీపీసీసీలో కేవలం రేవంత్​రెడ్డి సూచనల ప్రకారం మార్పులు చేయవద్దని కోరినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు బాగున్నాయని, రేవంత్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సీనియర్లలో అసంతృప్తి లేదని, తానే పార్టీలో సీనియర్ అని షబ్బీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకు కారణమవుతున్న పరిస్థితులను పార్టీ అధినేతకు వివరించామన్నారు. ఒకప్పటి హైదరాబాద్ రాష్ర్టం ప్రాంతానికి చెందిన ఖర్గేకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ అవగాహన ఉందని, పార్టీ ఐక్యత కోసం ఏం చేయాలనే అంశాలపై చర్చించామన్నారు. నాయకత్వం ఏదైనా మాట్లాడితే అందరూ అదే మాటమీద ఉండాలని, పార్టీ ఐక్యంగా ఉంటే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని పొన్నం అన్నారు. కాగా, రాష్ట్ర పార్టీలో మార్పులు, చేర్పులపై ఇప్పటికే వారం రోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఇదే సమయంలో రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఖర్గేను కలువడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్.. ట్విట్టర్‌లో కవిత ఫైర్


Next Story

Most Viewed