రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్.. తెలంగాణలో ‘అమిత్ షా’ సెన్సేషనల్ ఆపరేషన్!

by Disha Web Desk 4 |
రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్.. తెలంగాణలో ‘అమిత్ షా’ సెన్సేషనల్ ఆపరేషన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సౌత్ ఇండియాలో బీజేపీ విస్తరణకు తెలంగాణను ‘గేట్‌ వే’గా భావిస్తున్న బీజేపీ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వంతో పలుమార్లు అగ్రనేతలు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మే ఫస్ట్ వీక్ నుంచి కొన్ని సభల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని బృందాలను పంపించారు. ఇందులో కొన్ని నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌లో ఉండగా, మరికొన్ని ఫీల్డులో పార్టీ తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం తీరుతెన్నులతో పాటు పార్టీ నుంచి లభిస్తున్న సహకారం, స్టేట్ లీడర్‌షిప్ తీసుకుంటున్న చొరవ తదితరాలకు సంబంధించిన నివేదికలను అమిత్ షాకు పంపుతున్నాయి.

రోజువారీగా మానిటరింగ్

ఏయే పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనా, రోజువారీగా చోటుచేసుకుంటున్న మార్పులు, ప్రజల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఉన్న అభిప్రాయం, గెలుపు గ్రాఫ్‌లో వస్తున్న తేడాలు తదితరాలన్నింటిపై ఢిల్లీ నుంచే అమిత్ షా రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి టీమ్‌లు పంపే నివేదికలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేస్తున్నారని, నిర్లక్ష్యంగా ఉండొద్దని అభ్యర్థులకు సైతం సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అమిత్ షా గైడెన్సులో పనిచేసే టీమ్‌లు ఇప్పటికే పర్యటిస్తున్నాయి. పార్టీ హెడ్ క్వార్టర్‌లో ఉండే టీమ్‌లు ఫీల్డులోని బృందాలతో సమన్వయం చేసుకుంటున్నాయి. ఆ వివరాలను అమిత్ షా కు పంపే రిపోర్టుల్లో పొందుపరుస్తున్నాయి. రిపోర్టుల్లో ఈ బృందాలు ఏం పంపుతున్నాయో రాష్ట్ర లీడర్లకు తెలిసే చాన్స్ లేదు.

ఢిల్లీ నుంచి సూచనలు..

ప్రత్యర్థి పార్టీల బలాబలాలతో పాటు బీజేపీ అభ్యర్థులు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలపై ఢిల్లీ నుంచి సూచనలు అందుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి బలం ఉన్నట్టు తేలితే దానిని వీక్ చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులతో పాటు సొంత పార్టీ బలపడేలా చేపట్టాల్సిన చర్యలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాంటి గైడెన్సు అందుతున్నది. అభ్యర్థి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, సొంత పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఉన్నా దాన్ని అధిగమించడానికి నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ టైంలో ఇతర చర్యలు తీసుకోడానికి సైతం పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్టు సమాచారం.

ఇప్పుడు జరుగుతున్న ప్రచారంతో పార్టీకి బలం చేకూరుతుందనుకుంటే దాన్ని మరింత ఉధృతం చేయడం, ఒక వేళ ప్రజల్లోకి వెళ్లడం లేదనే అసంతృప్తి ఉంటే స్ట్రాటెజీలో చేయాల్సిన మార్పులపై అమిత్ షా నుంచి నేరుగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, అభ్యర్థులు, రాష్ట్ర సీనియర్లకు సూచనలు అందుతున్నాయి. పార్టీ పట్ల ఉన్న ఇమేజ్, మోడీ పట్ల ఉన్న ఆదరణ, కొత్త మేనిఫెస్టోలో ఉన్న అంశాలు... ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తూ పైచేయి సాధించడానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఫీడ్ బ్యాక్ అందుతున్నది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఢిల్లీ స్థాయిలో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి.

అంతా సీక్రెట్‌గా..

నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే జాగ్రత్తలు తీసుకుంటే ప్రచారం సమయం నాటికి చిక్కుల నుంచి బయటపడవచ్చన్నది పార్టీ భావన. అమిత్ షా పంపిన టీమ్ సభ్యుల్లో పార్టీ హెడ్ క్వార్టర్‌లో ఉండే కొద్దిమంది మినహా ఫీల్డులో ఉన్న సభ్యుల గురించి అభ్యర్థులకు సైతం తెలియడం లేదు. ఇక్కడి నుంచి ఏం రిపోర్టు వెళ్తున్నదో క్యాండిడేట్ల అంచనాకు అందడంలేదు. నేరుగా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తుండడంతో ఉదాసీతన, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తపడుతున్నారు. రాష్ట్రం మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో అవి సాకారమయ్యేలా పార్టీ కేంద్ర నాయకత్వం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకులకు స్పష్టత ఇవ్వడంతో పాటు కాంగ్రెస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నది.

పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అప్పజెప్పిన బాధ్యతలు పటిష్టంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అనేది సైతం అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. మే ఫస్ట్ వీక్ నుంచి ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ఇక్కడి ప్రచారానికి వచ్చే నాటికి ఫీల్డులో పరిస్థితి మెరుగుపడాలని అధిష్టానం భావిస్తున్నది. పోలింగ్ పూర్తయ్యేంత వరకూ అమిత్ షా పంపిన టీమ్‌లు ఇక్కడే ఉండనున్నాయి. వాటిని కోఆర్డినేట్ చేయడానికి సైతం మెకానిజం రూపొందింది. చాలామంది అభ్యర్థులు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని, మరికొన్నిచోట్ల అభ్యర్థులు చొరవ తీసుకుంటున్నా పార్టీ స్టేట్ లీడర్లు సహకారం అందించడం లేదని, శ్రేణులు సైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు అందడంతో ఈ తరహా చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది.

సర్వే రిపోర్టులతో మరింత ఫోకస్

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నదంటూ పార్టీ సొంత సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో వెల్లడవుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ మరింత ఫోకస్ పెట్టింది. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌లో ఉంటుందని, కొన్నిచోట్ల కాంగ్రెస్ సైతం చివరి స్థానంలోకి వెళ్తుందని నివేదికలు వస్తున్నాయి. దీని ఆధారంగా ప్రతి అవకాశాన్నీ అనుకూలంగా మల్చుకునేలా అదనపు జాగ్రత్తలు పార్టీ అధిష్టానం తీసుకుంటున్నది. మే ఫస్ట్ వీక్ నుంచి పది రోజుల పాటు తెలంగాణపై సీరియస్‌ దృష్టి సారించాలనుకుంటున్నది. అమిత్ షా టీమ్‌ల నుంచి వస్తున్న నివేదికలను సైతం సరిపోల్చుకుని తెలంగాణలో ఊహకు అందని తీరులో విజయాలను సాధించాలని పావులు కదుపుతున్నది. హర్ ఘర్ మోడీ క్యాంపెయిన్‌తో పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగతున్నదనే అంచనాకు వచ్చింది.


Next Story

Most Viewed