ఏప్రిల్ 3 నుండి 11 వరకు సలేశ్వరం జాతర..

by Disha Web Desk 4 |
ఏప్రిల్ 3 నుండి 11 వరకు సలేశ్వరం జాతర..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో గల సలేశ్వరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల కొంగుబంగారంగా, ఆదివాసీల చేత ప్రత్యేక పూజలు అందుకుంటూ... తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలవబడుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలను ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని జాతర నిర్వహణ కమిటీ నాయకులు శిర్ర రాములు, నిమ్మల లింగస్వామిలు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.

సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో నిర్వహణ కమిటీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. సలేశ్వరం జాతర ఉత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11 వరకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ ఉదయ్ కుమార్ మరియు డిఎఫ్ఓ రోహిత్ గోపిడిలను కలిశామని తెలిపారు. అధికారుల సమన్వయంతో జాతర ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వారికి సూచనలు చేశారన్నారు. ఈ జాతర విషయంపై రాష్ట్ర అటవీ శాఖ పిసిసిఎఫ్‌తో ఎమ్మెల్యే మాట్లాడి స్థానిక అటవీశాఖ అధికారులు నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేయరాదని అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారన్నారు.

కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలుగా సలేశ్వరం జాతర కొనసాగలేదని తదుపరి పరిణామాల అనంతరం జరుగుతున్న జాతరకు లక్షలాది భక్తులు వస్తారని అందుకు తగిన విధంగా అధికారులు సౌకర్యాలు కల్పించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ జాతరకు సుమారు పది లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ అధికారులు కొన్ని నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జాతర వల్ల కేవలం అడవిని నమ్ముకుని జీవిస్తున్న సమీప ఆదివాసి గుడాల చెంచు గిరిజనులకు కొంత ఆర్థికంగా తోడుబాటును అందిస్తుందని తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్ల విషయంపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ శాఖ అధికారికి సానుకూల నిర్ణయాలు తీసుకున్నందుకు ఆదివాసీ గిరిజనుల తరపున సలేశ్వరం జాతర నిర్వహణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు నిమ్మల శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు బల్మూరు లక్ష్మి, నిమ్మల బాలగురువయ్య, లింగయ్య, నిమ్మల చిన్న బాల గురువయ్యలు ఉన్నారు.

Next Story

Most Viewed