రెండు రోజుల్లో రూ.15 వేల కోట్లు ఇప్పిస్తా.. సర్కార్‌కు రేవంత్ స్విస్ ఛాలెంజ్

by Disha Web Desk 2 |
రెండు రోజుల్లో రూ.15 వేల కోట్లు ఇప్పిస్తా.. సర్కార్‌కు రేవంత్ స్విస్ ఛాలెంజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగు రోడ్డు టెండర్‌ ప్రక్రియ భారీ స్కామ్ అని వ్యాఖ్యానించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. వేల కోట్ల రూపాయలు చేతులు మారిందని ఆరోపించారు. ఈ టెండర్ ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మళ్ళీ కొత్త టెండర్లను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో పడిపోయే ప్రభుత్వం ముప్పై ఏండ్లకు ఓఆర్ఆర్‌ను లీజుకిచ్చిందని ఆరోపించారు. రెండు రోజుల టైమ్ ఇస్తే బ్యాంకుల నుంచి రూ. 15 వేల కోట్ల రుణాన్ని తీసుకొస్తానని, దీన్ని స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్‌ను కారు చౌకగా ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పిందన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేంద్ర విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేస్తానని అన్నారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఓఆర్ఆర్ కోసం 2006లో రూ. 6,696 కోట్లను రుణంగా తీసుకున్న ప్రభుత్వం ఆ ఒప్పందం గడువు మార్చి 31న తీరిపోయిందన్నారు. ప్రస్తుతం ఏ రకంగా చూసినా ఓఆర్ఆర్‌కు లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయని, ఏడాదికి రూ. 700 కోట్ల మేర ఆదాయం వస్తుందని, ఆ ప్రకారం లీజుకు ఇచ్చిన 30 ఏండ్ల గడువులో కనీసంగా రూ. 22 వేల ఆదాయం వస్తుందని, కానీ చివరకు టెండర్ ద్వారా రూ. 7,380 కోట్లకే ప్రభుత్వం కక్కుర్తి పడిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు.

టెండర్ దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థను ముందు పెట్టి కేటీఆర్ మిత్రులు ఫెనాన్షియల్ ఇన్వెస్ట్ మెంట్ రూపంలో ఈ సంస్థలోకి వస్తారని, చివరకు ఈ సంస్థ కేటీఆర్ చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. భవిష్యత్తులో కేటీఆర్ అమెరికాలో స్థిరపడినా, కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో సేద తీరుతున్నా నెలకు రూ. 100 కోట్ల చొప్పున ఆదాయం వచ్చే వనరుగా ఓఆర్ఆర్‌ను వినియోగించుకున్నారని అన్నారు. ఓఆర్ఆర్‌ మీద ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఇరుక్కుపోతాననే భయంతో వివరణ ఇవ్వకుండా కేటీఆర్ ముఖం చాటేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటని ప్రశ్నించారు.

బిడ్ నిర్వహణ ఎన్‌హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగిందని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్తున్నారుగానీ టెండర్ల విషయంలో ఎన్‌హెచ్ఏఐ అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తున్నదని, ఆ తర్వాత మారుతుందని, ఏ రహదారి టెడంర్ అయినా 20 ఏళ్లకు మించి ఇవ్వొద్దని ఎన్‌హెచ్ఏఐ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30 ఏళ్ల కాలానికి లీజుకివ్వడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఏఐ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు.

బేస్ ప్రైస్ అంశాన్ని ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచిందని, అరవింద్ కుమార్ ఎందుకు బైట పెట్టడానికి భయపడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. బేస్ ప్రైస్ లేకుండా టెండర్లు నిర్వహిస్తారా అని నిలదీశారు. అందులో దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం లాంటి కీలకమైనవేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్‌ను అమ్మేసుకునే హక్కు కేసీఆర్‌కు ఎవిచ్చారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ కారిడార్ టెండర్ ప్రక్రియకు ముందు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) పరిధిలో ఉండేదని, ఎందుకు హఠాత్తుగా బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ ఎండీ సంతోష్‌ను మార్చి రిటైరైన బీఎల్ఎన్ రెడ్డిని నియమించి పూర్తి చేశారని ఆరోపించారు.

ఐఆర్బీ సంస్థ బిడ్‌లో రూ. 7,272 కోట్లు మాత్రమే దాఖలు చేస్తే టెండర్ వివరాలు ప్రకటించే నాటికి అది రూ. 7,380 కోట్లుగా ఎలా మారిందని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ నిర్వహణలో గ్రీనరీ బాధ్యత కూడా ఉంటుందని, కానీ, ఐఆర్‌బీ సంస్థకు దాని నుంచి మినహాయింపు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. గ్రీనరీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ. 40 కోట్ల చొప్పున 30 ఏళ్లకు రూ. 1,200 కోట్లు అవుతుందని, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఐఆర్బీకి వాస్తవంగా రూ. 6000 కోట్లకే టెండర్ దక్కినట్లయిందన్నారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారమే టెండర్ నిర్వహించినట్లు ఐఏఎస్ అరవింద్ సమర్థించుకుంటున్నా ఆ సంస్థపై పలు దేశాల్లో కేసులు ఉన్నాయని రేవంత్ గుర్తుచేశారు.

టెండర్లు ఓపెన్ చేయగానే వివరాలను అధికారులు వెల్లడిస్తారని, కానీ ఏప్రిల్ 27న ప్రకటించినా 16 రోజులపాటు ఎందుకు సీక్రెట్‌గా ఉంచారని ప్రశ్నించారు. 16 రోజుల్లో జరిగిన గూడుపుఠాణీ ఏమిటన్నారు. ఈ సంస్థ 2017లో కొద్ది రోజులు టోల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిందని, రోజుకు రూ. 87 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 60 లక్షలే చెల్లిస్తుండటంతో డిపాజిట్‌గా ఉన్న రూ.25 కోట్లను ప్రభుత్వం సీజ్ చేసి బ్లాక్ లిస్ట్ చేసింది వాస్తవం కాదా అని గుర్తుచేశారు. అలాంటి కంపెనీ ఇప్పుడు మళ్లీ ఎట్లా తెరమీదకు వచ్చిందన్నారు.

తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అరవింద్ కుమార్.. ఆర్టీఐ ప్రకారం అడిగినా సమాచారాన్ని ఇవ్వలేదని, సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ బిడ్‌లో అవినీతి, దోపిడీ నిజమని, దీనికి సూత్రధారి, పాత్రధారి అరవింద్ కమారేనని, ఆయనపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్‌కు పిర్యాదు చేస్తామన్నారు. కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, డీవోపీటీకి కూడా అరవింద్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఓఆర్ఆర్ అంశంపై విచారణ చేయాల్సిందిగా కాగ్ కూడా పిర్యాదు చేస్తామన్నారు.

Next Story