- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: చరిత్రలో ఇదే తొలిసారి.. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ పెట్టారు. ‘అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బీఆర్ఎస్(BRS) డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారింది. భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు. పండుగ లేదు.. పబ్బం లేదు.. వాన లేదు.. ఎండ లేదు.. రాత్రి లేదు.. పగలు లేదు.. క్యూలో నిలబడుతున్నారు.. అలసి పడిపోతున్నారు.
ఓపిక లేక క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల పాటు నిరీక్షిస్తున్నారు. పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు అని ఒక రైతు.. వరి పొట్ట దశలో ఉంది.. యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం అని మరొక రైతు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి రావడమే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం. ఎక్కడిక్కడ హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే నిదర్శనం.
ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం. యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇది. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిది. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు. పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఉండి ఏం లాభం. కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, సరఫరాలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయం. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండటం దారుణం. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం. రైతు డిక్లరేషన్ అని దగా చేసారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో పచ్చి మోసం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తున్నారు. అరిగోస పెడుతున్నారు. జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి రేవంతు అంటున్నాడు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం తప్ప చేస్తున్నదేం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 10శాతం తగ్గించడంతో ఆయిల్ ఫాం రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లై బాధ పడుతున్నారు. ఇక యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతులు కంటి నిండా నిద్ర పోని పరిస్థితి. ఇన్ని సమస్యలు రైతులను చుట్టుముడుతున్నా ఇక్కడి బీజేపీ(BJP), కాంగ్రెస్ ఎంపీలకు ఉలుకు లేదు, పలుకు లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నది. ఏమీ లేదు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు.
పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే యూరియా కోసం రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం’ అని హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.






