లోన్ల రికవరీ వేధింపులకు చెక్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

by Disha Web |
లోన్ల రికవరీ వేధింపులకు చెక్..  ఆర్బీఐ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కరోనా సమస్య ఇంకా వెంటాడుతున్నది. ఆర్థిక కష్టాలతో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతున్నది. సకాలంలో చెల్లించకపోతే రికవరీ పేరుతో ఔట్‌సోర్సింగ్, థర్డ్ పార్టీ ఏజెంట్లతో వేధింపులు పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లతో లోన్ యాప్‌ల సంగతి సరేసరి. ఆత్మహత్యలకూ కారణమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు స్వంత సిబ్బంది మాత్రమే రికవరీ కోసం ప్రయత్నించాలని, థర్డ్ పార్టీ లేదా ఔట్‌సోర్సింగ్ ద్వారా వేధింపులకు గురిచేయవద్దని సర్క్యులర్ జారీచేసింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మహీంద్ర ఫైనాన్షియల్ సంస్థకు సంబంధించిన సర్క్యులర్ మాత్రమే అయినా ఇకపైన ఇలాంటి అన్ని సంస్థలకూ ఇది వర్తించే తీరులో యాక్షన్ చేపట్టనున్నది.

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. కరోనా కష్టకాలంలో బ్యాంకుల నుంచి, నాన్-బ్యాంకింగ్ ద్రవ్య సంస్థల నుంచి పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు రుణాలు తీసుకోక తప్పలేదు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ఆదాయ వనరులు పడిపోవడంతో లోన్ తీసుకోవడం అనివార్యమైంది. తాత్కాలికంగా అప్పులతో నెట్టుకొచ్చినా ఆ తర్వాత వాటిని తీర్చడం కత్తిమీద సాములా తయారైంది. కొద్దిపాటి ఆస్తుల్ని అమ్ముకుని బతుకుతున్న కుటుంబాలూ గణనీయంగానే ఉన్నాయి. అప్పులు తీసుకున్న తర్వాత వాటిని సకాలంలో చెల్లించలేకపోవడంతో వడ్డీ భారం పెరిగిపోయింది. అసలు (ప్రిన్సిపల్) మొత్తాన్ని కట్టడం కూడా గగనంగా మారింది. దీంతో డిఫాల్టర్లుగా మారిపోతున్నారు.

లోన్ రికవరీ కోసం యాప్‌ల మొదలు నాన్-బ్యాంకింగ్ సంస్థలు, బ్యాంకులు కూడా ప్రైవేటుగా థర్డ్ పార్టీ లేదా ఔట్‌సోర్సింగ్ కంపెనీలను ఆశ్రయించి రికవరీ బాధ్యతలను అప్పజెప్తున్నారు. రికవరీ కోసం వచ్చే వీరు అనేక రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషించడం మొదలు అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇంట్లోని విలువైన వస్తువులను దౌర్జన్యంగా తీసుకెళ్ళడం లాంటి పద్ధతులనూ అనుసరిస్తున్నారు. ఇలాంటి చర్యలను తట్టుకోలేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని లోన్ యాప్‌లపై రిజర్వు బ్యాంకు నిషేధం విధించింది. ఐటీ, ఈడీ బృందాలు కూడా రంగంలోకి దిగి ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నది.

బ్యాంకులకు, ఫైనాన్షియల్ సంస్థలు స్వంత సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండడంతో ప్రైవేటు సంస్థలను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకుంటున్నాయి. రుణాలను వసూలు చేయడమే ఈ కాంట్రాక్టుకు ఏకైక ప్రాతిపదిక. రికవరీ కోసం ఇండ్లు వెళ్తున్న ప్రైవేటు వ్యక్తులు అందినకాడికి వసూలు చేసుకోవడమే ఏకైక డ్యూటీ. వసూలు చేసిన డబ్బును టీమ్‌ల ద్వారా బ్యాంకుకు జమ చేసిన రెండు నెలల తర్వాత కమిషన్ రూపంలో వీరికి పారితోషికం అందుతుంది. ఆ టార్గెట్ చేరుకోవడం కోసమే రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. కరోనా తర్వాతి పరిస్థితుల్లో వసూళ్ళు కష్టంగా మారాయని, అందువల్లనే టార్గెట్ రీచ్ కాలేకపోతున్నామని మొత్తుకుంటున్నారు. ఒకవేళ టార్గెట్ ప్రకారం వసూలు కాకపోతే యువకులకు ఉపాధి కోల్పోవడంతో పాటు ఆ కంపెనీకి బ్యాంకుతో ఉన్న కాంట్రాక్టు రద్దవుతుంది.

ఈ చిక్కులే ఇప్పుడు రుణాలు తీసుకున్న ప్రజలకు సంకటంగా మారుతున్నాయి. వీలైనంత ఎక్కువ మొత్తంలో రికవరీ చేసుకోవడమే లక్ష్యంగా వేధింపులకు గురిచేస్తున్న థర్డ్ పార్టీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వారి ఉద్యోగ భద్రతను, కమిషన్ రూపంలో అందే ఆదాయాన్ని, ఉపాధి అవకాశాన్ని నిలుపుకోవాలని చూసుకుంటున్నారు. వసూళ్ళ కోసం అనుసరించే విధానాలు, వేధింపులను తట్టుకోలేక పోలీసు కేసులతో పాటు ఆత్మహత్యలకూ పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లోన్ యాప్‌ల తీరు మరింత ఘోరంగా మారుతున్నదని గుర్తించిన కేంద్రం వీటిపై ఆంక్షలను కఠినం చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలోని మహింద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను రికవరీల కోసం థర్డ్ పార్టీ, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌ను వాడవద్దంటూ నాలుగు రోజుల క్రితం సర్క్యులర్ జారీచేసింది. రుణాలు వసూలు చేసుకోడానికి స్వంతంగా బ్యాంకు స్టాఫ్‌ను మాత్రమే వాడుకోవచ్చని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులను జారీచేసేంతవరకూ ఈ సర్క్యులర్ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో రిజర్వుబ్యాంకు కఠినంగా వ్యవహరించింది. విడివిడిగా ఒక్కో సంస్థను హెచ్చరిస్తున్న ఆర్బీఐ త్వరలో కామన్‌గా స్పష్టమైన విధివిధానాలను రూపొందించే అవకాశమూ ఉన్నది.

Next Story

Most Viewed