బొక్కల కంపెనీ దుర్వాసనతో చస్తున్నాం..

by Disha Web Desk 20 |
బొక్కల కంపెనీ దుర్వాసనతో చస్తున్నాం..
X

దిశ, యాచారం : బొక్కలకంపెనీ నుంచి వస్తున్న దుర్వాసనతో చస్తున్నామని మండలంలోని కొత్తపల్లి గ్రామస్థులు అంటున్నారు. కొత్తపల్లిలో కిసాన్ ఆగ్రో ఫీడ్స్ కంపెనీతో కొనసాగుతున్న బొక్కల కంపెనీ మూసివేయాలని ఆ గ్రామస్తులు కొనసాగిస్తున్న నిరసన దీక్ష ఆదివారం నాల్గవ రోజుకు చేరింది. దీక్షలో కూర్చున్న కొత్తపల్లి గ్రామస్థులకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సంఘీభావం తెలిపారు. రాజకీయాలన్నిటిని పక్కనపెట్టి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య కారక బొక్కల కంపెనీ మూసివేసేలా దీక్ష వహిస్తున్న గ్రామస్థులకు అభినందనలు తెలిపారు.

మరణించిన జంతు కళేబరాల వ్యర్థ పదార్థాలతో కల్తీ నూనెల తయారీ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హరిస్తున్న కంపెనీని అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం విచారకరమన్నారు. కంపెనీ చుట్టుపక్కల వ్యవసాయ పొలాల్లో సైతం రైతులు తమ పంట పొలాలను సేద్యం చేసుకోకుండా విఘాతం కలిగిస్తుందన్నారు. నిల్వ ఉంచిన వ్యర్థ పదార్థాలతో పరిసర గ్రామాలు దుర్వాసనకు లోనవుతు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కంపెనీ మూసివేయాలని కంపెనీ మూసే వరకు నిరసన దీక్షకు అండగా, తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కావలి జగన్, వైస్ ఎంపీపి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్కు నర్సింహా, ఎంపీటిసి లక్ష్మీపతి గౌడ్, నాయకులు ఆకుల ఆనంద్ కుమార్ , జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed