Kalwakurthy :కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి ఎవరు ?

by Disha Web Desk 20 |
Kalwakurthy :కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి ఎవరు ?
X

దిశ, ఆమనగల్లు : మరో 10 నెలల్లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిని బీజేపీ ఖాతాలో వేసుకోవటానికి అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తిలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థి పై సర్వే ప్రారంభించినట్లు సమాచారం. కల్వకుర్తిలో కాషాయజెండా రెపరెపలాడాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరుండాలని ఇప్పటికే రెండు దఫాలు సర్వే పూర్తి చేసినట్లు వినికిడి. త్వరలోనే మూడవ సర్వే చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారికే టికెట్ కేటాయిస్తారా లేదా కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారా అనేది ఈ సర్వేలో తేలనుంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక సర్వే పూర్తయింది. రెండవ దఫా సర్వేను జాతీయ అధిష్టానం నిర్వహించినట్లు వినికిడి. కాగా 3వ సర్వేను రాష్ట్రనాయకత్వం నిర్వహించనున్నది. ఈ 3 సర్వేల ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తేల్చనున్నారు. స్థానిక నేతలకు తెలియకుండానే 2సర్వేలు పూర్తి చేయగా, 3వ సర్వేను కూడా అలాగే చేపట్టనున్నారు.

తల్లోజు ఆచారికా .. కొత్త అభ్యర్థికా ?

38 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్న తల్లోజు ఆచారికే టికెట్ కేటాయిస్తారా లేదా అనేది 3సర్వేల అనంతరం తేలనుంది. నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిఉన్న తల్లోజు ఆచారి ఎమ్మెల్యేఅభ్యర్థి అని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. 1994, 2004, 2009, 2014, 2018 సంవత్సరాల్లో 5సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2014లో 78ఓట్ల స్వల్ప తేడాతో, 2018లో 3000ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనుటకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఇటీవల నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి బీజేపీ టికెట్ తనకు కేటాయించాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరిపారు. మంతనాలు జరిపిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకొని టికెట్ ఇస్తుందా? లేదా ఆచారికే కేటాయిస్తుందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది మరో 2నెలల్లో స్పష్టత రానుంది.

Next Story

Most Viewed