రైతులకు మద్దతుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కేసీఆర్

by Mahesh |
రైతులకు మద్దతుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు, (గురువారం.,16.05.24)రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..“రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందన్నారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్ళు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహం తోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ఈ కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపు

ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని.. ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్ఎస్ శ్రేణులు పోవాలని, రైతులకు అండగా నిలవాలని టీఆర్ఎస్ అధినేత పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. దీంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనుంది.

Next Story

Most Viewed