సర్పంపల్లి ప్రాజెక్టులో మట్టి దొంగలు

by Disha Web Desk 12 |
సర్పంపల్లి ప్రాజెక్టులో మట్టి దొంగలు
X

దిశ ప్రతినిధి, వికారాబాద్: మండల పరిధిలోని సర్పంపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ అండదండలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల అండదండలతో ఓ రిసార్ట్స్ యజమాని రెచ్చిపోయి సర్పంపల్లి ప్రాజెక్ట్ నుంచి మట్టి, నీళ్లలాంటి సంపద దోచుకొని వ్యాపారం చేస్తుంటే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ రిసార్ట్స్ అక్రమాలపై ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చినా అధికారుల నుంచి ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నెల క్రితం జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్‌కు ఈ సమస్యపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎలాంటి పురోగతి లేనట్లు తెలుస్తుంది. చట్టానికి విరుద్ధంగా రిసార్ట్స్ యజమాని ఎన్ని అక్రమాలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైతుల పేరుతో ప్రాజెక్టు నుంచి మట్టి తరలింపు..!

రిసార్ట్స్ యజమాని ఎన్ని తప్పులు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తనకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం కాదు. ఇద్దరికీ ఒకే న్యాయం అంటూ స్థానిక నాయకుడు రైతుల పేరు చెప్పి అక్రమంగా మట్టి అమ్ముకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం అనుమతులకు ఇరిగేషన్ అధికారులను అప్లికేషన్ పెట్టుకుంటే, ఇరిగేషన్ అధికారులు మంగళవారం అనుమతులు ఇచ్చారు. కానీ ఆ నాయకుడు మాత్రం అనుమతులు రాకుండానే 5 రోజులుగా అక్రమంగా మట్టి అమ్ముకుంటున్నాడని సమాచారం.

ప్రాజెక్ట్‌లో ఫీటు లోతువరకే మట్టి తీయాలని నిబంధనలు ఉండగా, అవేవీ పట్టించుకోని ఆ నాయకుడు ఆరు నుంచి ఏడు పీట్ల లోతు గుంతలు తవ్వి మట్టి తరలిస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సర్పంపల్లి ప్రాజెక్ట్ లో అక్రమాలకు పాల్పడుతున్న రిసార్ట్స్ యజమానితో పాటు అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నాయి.

Next Story

Most Viewed