ఆక్ర‌మ‌ణ‌లు 10 రోజుల్లో తొల‌గించండి.. హైడ్రా ఆదేశం

by Nallavelli.Anjaneyulu |

ముష్కి చెరువు FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను పది రోజుల్లో తొలగించాలని హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆక్ర‌మ‌ణ‌లు 10 రోజుల్లో తొల‌గించండి.. హైడ్రా ఆదేశం
X

దిశ‌, గండిపేట : ముష్కి చెరువు FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను పది రోజుల్లో తొలగించాలని హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం హైడ్రా ఉన్నతాధికారులు నార్సింగి సర్కిల్ పరిధిలోని మై హోమ్ అవతార్ సమీపంలో ఉన్న ముష్కి లేక్‌ను సందర్శించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణలపై సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అక్కడి భూముల యజమానులు, నివాసితులతో అధికారులు నేరుగా మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. గత రెండు నెలలుగా పలుమార్లు నోటీసులు జారీ చేసి ముందస్తు సమాచారం అందించామని అధికారులు తెలియజేశారు. స్థానికుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఇది చివరి అవకాశం అని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించేందుకు 10 రోజుల గడువు ఇచ్చినట్టు వెల్లడించారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story