పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. అర్హతలేని డాక్టర్లతో ఆపరేషన్లు!

by Disha Web Desk 6 |
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. అర్హతలేని డాక్టర్లతో ఆపరేషన్లు!
X

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటించని హాస్పిటల్ లో వైద్యం 3 సూదులు,6 గోలీలుగా వర్ధిల్లుతోంది. డాక్టర్లు లేక నర్సింగ్ సిబ్బంది లేకపోయినా కేవలం డాక్టర్ సర్టిఫికెట్లు మాత్రమే చూపించి ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించేందుకు అనుమతులు పొందుతున్నారని ఆరోపణలున్నాయి. కనీస వసతులు లేని ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలకు, పిఎంపీలకు అంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్ల ఎర చూపించి పేషెంట్లను తమ ఆసుపత్రులకు రప్పించుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో వైద్యం చేస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఆసుపత్రులతో పాటు రక్త పరీక్షలు, ఎక్స్ రే క్లినిక్ లు యదేచ్చగా వారికి నచ్చిన ధరలలో కొనసాగిస్తున్నారు. ఆర్ఎంపీలు సైతం పెద్ద పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేసుకొని అన్ని రోగాలకు చికిత్సలు నిర్వహిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిద్రమత్తును వీడడం లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు మునిసిపాలిటీ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

పూర్తిస్థాయిలో పరిజ్ఞానం ఉన్న వైద్యులు లేకపోగా, ల్యాబ్ టెక్నీషియల్ గా గుర్తింపు లేని వ్యక్తులను నియమించుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేయాలి? ఏ చికిత్సకు ఎంత డబ్బు చెల్లించాలి? అనే బోర్డులను ప్రదర్శించాల్సి ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స కోసం దేనికి ఎంత చెల్లించాలి అనే సూచిక బోర్డులు లేకపోవడంతో గ్రామీణ నిరక్షరాస్యులైన పేద ప్రజలను దొరికిన కాడికి దోచుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్స్, ఫిజియోథెరపీ, ల్యాబు లు ఫీజుల విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లు నడవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని వైద్యు లు కొంతమంది డబ్బే ప్రధాన ఎజెండాగా గర్భిణీలకు అబార్షన్లు చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ గతంలో కొంతమంది వైద్యులు పట్టుబడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి.

ప్రజల ప్రాణాలకు ఖరీదు?

నాలుగు మండలాలకు కూడలిగా హైదరాబాద్‌కు సమీపంలో గల ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రవేట్ హాస్పి టల్స్ ఉన్నాయి. మారుమూల గ్రామ ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు వచ్చే పేదలకు వైద్యం పేరుతో వారి ప్రాణాలను బలిగొంటున్నారు. పట్టణంలోని స్వాతి మల్టీప్లెక్స్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం నరేష్ రెడ్డి అనే యువ కుడు మృతి చెందాడు. గతంలో కూడా తలకొండపల్లి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన గర్భిణి మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకుంటే, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించడంతో,విషయం బయటకు పోకుండా హైదరాబాదులో మంతనాలు జరిపి 8 లక్షల వరకు డబ్బులు ముట్ట చెప్పిచేతులు దులుపుకున్నారు. 2 రోజుల క్రితం రాంపూర్ గ్రామా నికి చెందిన నరేష్ రెడ్డిని కూడా డాక్టర్ల ఆపరేషన్ వికటించి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. చివరకు కొంతమంది నేతలు మంతనాలు జరిపి బాధిత కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్పి చేతులు దులుపుకున్నట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

ఆమనగల్ పట్టణ కేంద్రంలోని ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు చనిపోయిన డోంట్ కేర్.. డబ్బులు ఉంటే చాలు కిమ్ అనకుండా లోలోన ముట్ట చెప్పి 4రోజులు ఆస్పత్రి బందు చేసి, అనంతరం మళ్లీ డాక్టర్ల నేమ్ బోర్డు మార్చేసి తెరుచుకొని నడపొచ్చనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై, ల్యాబ్ లపై, స్కానింగ్ సెంటర్లపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story